పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికకాయం వద్ద రోదిస్తున్న భార్య స్వప్న
వరంగల్ గిర్నిబావి నుంచి నల్లబెల్లి వరకు 31 కిలోమీటర్ల మేర జనసంద్రం
ప్రతి అడుగూ కన్నీటి నివాళి, నర్సంపేటలో వ్యాపారుల స్వచ్ఛంద బంద్
దాదాపు 12 గంటలపాటు సాగిన సుదర్శన్‌రెడ్డి అంతిమ యాత్ర..
నల్లబెల్లిలో అంత్యక్రియలు పూర్తి
నివాళులరి్పంచిన కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
సాక్షి, వరంగల్: తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి శుక్రవారం వేలాదిమంది ప్రజలు, ఉద్యమకారులు కన్నీటి నివాళి అర్పించారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి హనుమకొండలోని అమరువీరుల స్తూపం వద్దకు తీసుకొచ్చిన పెద్ది పార్థివదేహానికి వందలాది మంది నివాళులర్పించారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా నర్సంపేట రోడ్డు మార్గంలో ఆ నియోజకవర్గం ప్రారంభమయ్యే గిర్నిబావి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నల్లబెల్లి వరకు 31 కిలోమీటర్ల మేర జనసంద్రంగా సాగింది.
రహదారి మొత్తం కన్నీటి సముద్రంగా మారగా.. ‘పెద్ది అమర్ రహే‘, ‘జోహార్ పెద్దన్న‘నినాదాలతో మార్మోగిపోయింది. ఉదయం 9.30 గంటలకు గిర్నిబావికి చేరుకున్న పెద్ది పారి్థవదేహం ఉన్న రథం.. లక్నెపల్లి, మహేశ్వరం, నర్సంపేట, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, రుద్రగూడెం, నారక్కపేట మీదుగా నల్లబెల్లి చేరుకున్నాక రాత్రి 10 గంటలకు పెద్ది వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు ముగిశాయి. సాధారణంగా గంటలో పూర్తయ్యే ఈ ప్రయాణం. ప్రతీ గ్రామంలో ప్రజలు చివరిసారి తమ నాయకుడిని చూసేందుకు పోటీపడటంతో గంటల తరబడి సాగింది.
ఘొల్లుమన్న గిర్నిబావి...
అంతిమయాత్ర ప్రారంభమైన గిర్నిబావిలో ‘మళ్లీ ఎప్పుడూ వస్తావు పెద్దన్నా’అంటూ మహిళలు విలపించిన తీరు హృదయాలను కదిలించింది. రహదారుల వెంట నిలబడ్డ ప్రజలే కాదు... వెళ్తున్న బస్సుల్లోని ప్రయాణికులు కూడా కిటికీల్లో నుంచి బయటకు వంగి పెద్ది పారి్థవదేహానికి చేతులెత్తి నమస్కరించారు.
భార్య స్వప్న కన్నీళ్లు..గుండెల్ని పిండేశాయి
పారి్థవదేహంతో సాగుతున్న రథంలో ఉన్న ఆయన సతీమణి పెద్ది స్వప్న ప్రజలను చూస్తూ ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు నిదర్శన్‌రెడ్డి మధ్యమధ్యలో తల్లి కన్నీళ్లు తుడవడం కనిపించింది. కుటుంబ సభ్యుల రోదనలు చూసి అభిమానులు, కార్యకర్తలు బోరున విలపించారు. అన్న లే అన్నా...రాఖీ తెచ్చానంటూ పెద్ది సోదరి విలపించడం కంటతడి పెట్టించింది.
నర్సంపేట స్వచ్ఛంద బంద్
తమ అభిమాన నాయకుడికి నివాళిగా నర్సంపేట పట్టణం స్వచ్ఛందంగా బంద్ పాటించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగామూసివేయగా, పాఠశాలలు కూడా సెలవు ప్రకటించాయి. అయ్యప్ప టెంపుల్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు వేలాదిమంది ప్రజలు ర్యాలీగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కళాకారులు గిద్దె రాంనర్సయ్య, దార దేవేందర్ ఆలపించిన నివాళి గీతాలు వేలాదిమందిని కంటతడి పెట్టించాయి.

చివరి చూపునకు ప్రముఖుల రాక...
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ , మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, మాలోతు కవితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యలు కూడా నల్లబెల్లిలో నివాళులర్పించారు.
నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు
సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో గంటపాటు జోరు వాన కురిసింది. నల్లబెల్లిలోని నివాసం నుంచి ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రావు, పాడికౌశిక్‌రెడ్డిలు పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా వేలాది మంది ప్రజల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు నిదర్శన్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు.


