క్లాసులకు ముందే కౌన్సెలింగ్‌ | Counseling for students before classes begin: AICTE directives to universities | Sakshi
Sakshi News home page

క్లాసులకు ముందే కౌన్సెలింగ్‌

Aug 1 2026 6:01 AM | Updated on Aug 1 2026 6:01 AM

Counseling for students before classes begin: AICTE directives to universities

విద్యార్థుల మానసిక ఒత్తిడిని ముందే పసిగట్టే విధానం

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ కేంద్రాలు

పక్షం రోజులపాటు ప్రతీ కాలేజీ నుంచి నివేదిక

యూనివర్సిటీలకు ఏఐసీటీఈ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. జాతీయస్థాయిలో ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఇప్పటికే అన్ని దశల కౌన్సెలింగ్‌ పూర్తి అయింది. ఆగస్టు రెండోవారంలో క్లాసుల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్లాసుల కన్నా ముందు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి సూచించింది. తాజాగా అన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించింది.

కొన్నేళ్లుగా ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మానసిక ఒత్తిడి వల్లే ఇవి జరుగుతున్నాయని గుర్తించింది. దీంతో ఈ ఏడాది నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నారు. విద్యార్థి సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాతే క్లాసులు మొదలు పెట్టాలని కూడా సూచించింది. దీనికి 15 రోజులు గడువు ఇవ్వాలని పేర్కొంది. విద్యార్థి ముభావంగా, నూన్యతభావంతో ఉంటే గమనించి, అవసరమైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలని తెలిపింది. 

పెరుగుతున్న ఆత్మహత్యలు 
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో విద్యార్థుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి. 2021 నుంచి 2025 వరకూ 65 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది బాలురే ఉంటున్నారు. చనిపోతున్న వారిలో మొదటి ఏడాది విద్యార్థులు 80 శాతం, మరో 20 శాతం ఆఖరి ఏడాది ఇంజనీరింగ్‌లో ఉన్నవారే. స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2003 నుంచి 2025 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు చనిపోయారు. సీఎస్‌ఈ, అనుబంధ కంప్యూటర్‌ బ్రాంచ్‌లకు చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. మరణాలు కూడా అత్యంత భయంకరంగా ఉంటున్నాయని అధ్యయనంలో తేలింది. ముంబై ఐఐటీలో 21 సంవత్సరాల విద్యార్థి హాస్టల్‌ టెర్రస్‌పై నుంచి దూకి చనిపోయాడు.  

సమస్య ఎక్కడ ? 
జేఈఈ, ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా ఆత్మహత్యల జాబితాలో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడేనని ఐఐటీ ముంబై జరిపిన పరిశోధనలో తేలింది. ఇంటర్‌కు ఇంజనీరింగ్‌ విద్యకు సారూప్యత ఉండటం లేదు. ఇంటర్‌లో చాప్టర్స్‌ను బట్టీ పట్టిస్తున్నారు. జేఈఈలో మలి్టపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉండటం వల్ల తేలికగా సమాధానం ఇవ్వగలుగుతున్నారు. ఇంజనీరింగ్‌లో చాప్టర్లన్నీ విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి. వీటి మూలాలు ఇంటర్‌లో ఉంటాయి. వీటిపై పట్టులేకపోవడం వల్ల విద్యార్థులకు ఏమాత్రం అర్థం కావడం లేదు.

బేసిక్‌ సరిగా లేకపోవడం వల్ల ఇతర విద్యార్థులతో వెనుకబడి పోయే పరిస్థితి ఏర్పడుతోంది. తొలి సెమిస్టర్‌లో మార్కులు తక్కువ రావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి ‘మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయి’అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులను కుంగదీస్తున్నాయి. ఆఖరి సంవత్సరంలో బ్యాక్‌లాగ్స్‌ ఉండటం, ఉద్యోగ అవకాశాలపై ఆందోళన విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఐఐటీల అధ్యయనంలో వెల్లడైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement