వాజేడు మండల కేంద్రంలో వరద నీటిలో మునిగిన ఇళ్లు
భద్రాచలం వద్ద శరవేగంగా పెరిగిన ప్రవాహం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ అశ్వాపురం/మంచిర్యా ల రూరల్/ కాళేశ్వరం/ఏటూరునాగారం/వాజేడు: నిన్నమొన్నటి వరకు నీటి ప్రవాహం లేక ఇసుక తిన్నెలతో దర్శనం ఇచ్చిన గోదావరి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వానలతో బుధవారం రాత్రి నుంచి క్రమంగా గోదావరిలో వ రద పెరుగుతూ వచ్చింది. శుక్రవారం ఉదయం 10:14 గంటలకు భద్రాచలం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం 3:48 గంటల సమయాన 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చే అవకాశముంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు ప్రభుత్వ విభాగాలు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాలు జారీ చేశారు.
నదిలో చిక్కుకున్న కూలీలు
చర్ల మండలం వీరాపురం ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పనికి వెళ్లిన 44 మంది కూలీలు శుక్రవారం వరదలో చిక్కుకున్నారు. ఉదయం కూలీలు పనికి వెళ్లినప్పుడు గోదావరి ప్రవాహం సాధారణంగా ఉంది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా వరద చుట్టు ముట్టింది. ఒడ్డున ఉన్న ఇతర కూలీలు పరిస్థితిని గమనించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూలీలను క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. అయితే పోలీసులు ప్రయాణించిన పడవ తిరగబడడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ ఆ ప్రాంతంలో లోతు తక్కువగా ఉండటంతో ఎవరికీ ఏమీ కాలేదు.
ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకుగాను 18.680 టీఎంసీల మేర నీరుంది.
గోదావరి– ప్రాణహితకు పోటెత్తిన ప్రవాహం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు గోదావరి, ప్రాణహిత నదుల వరద పోటెత్తింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.300 మీటర్ల ఎత్తున నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 10,62,240 క్యూసెక్కుల వరద రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి ఔట్‌ఫ్లో రూపంలో దిగువకు అదేస్థాయిలో నీటిని వదిలారు.
రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
వర్షాలకు గోదావరి బ్యాక్ వాటర్‌తో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు, దయ్యాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు శుక్రవారం జారీ చేశారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బరాజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి 14,60,500 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో బరాజ్ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు.
దేవాదులలో నిలిచిన పంపింగ్
గుట్టలగంగారం వద్ద ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టులో అధికారులు పంపింగ్ నిలిపివేశారు. 10 మోటార్లలో 9 మోటార్లతో భీంఘన్‌పూర్‌లోని రిజర్వాయర్‌కు ఎత్తిపోసిన అధికారులు శుక్రవారం పంపింగ్‌ను నిలిపివేశారు.
తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద 19.49 మీటర్లకు నీటిమట్టం చేరింది. టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి చేరిన గోదావరి వరదతో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.
సురక్షిత ప్రాంతాలకు గర్భిణులు
గోదావరి వరద పెరగడంతో నెలలు నిండిన గర్భిణులను ముందస్తుగానే ఆస్పత్రులకు చేరుస్తున్నారు. అశ్వాపురం మండలం రాంనగర్‌లో ఇద్దరు గర్భిణులు ఉండగా, శుక్రవారం ఉదయం ఒకరిని మణుగూరు ఆస్పత్రికి తరలించారు. మరో గర్భిణి సోడె లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగానే రాంనగర్–బట్టి గుంపు రహదారిపైకి వరద చేరి రాకపోకలు నిలిచాయి. దీంతో ఆమెను స్థానికులు థర్మకోల్ షీట్‌తో చేసిన తెప్పపై కూర్చోబెట్టి వరద ప్రాంతం దాటించారు.


