వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం
ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
సీఐఐ ఉత్తరాది ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు సురక్షిత స్థానమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తరాది ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వనించారు. పెట్టుబడులకు రక్షణగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయని సీఎం తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో కొన్ని పాలసీలు ప్రవేశపెట్టారని.. వాటిని కొనసాగిస్తూనే తాము సరికొత్త పాలసీలు తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలో విధానపరమైన స్తబ్దత లేదని.. నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి పాలసీ తీసుకొస్తే అది కొనసాగుతోందన్నారు.
ప్యూర్‌కు తరలిస్తాం..
ఫారూచ్యన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబై, ట్రాఫిక్ కష్టాలతో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించామని సీఎం చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించామని, ఇక్కడ సేవా రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
ఔటర్ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్‌గా గుర్తించామని.. అక్కడ తయారీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు వెలుపల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రేవంత్ వివరించారు. హైదరాబాద్ పరిధిలోని పరిశ్రమలను ప్యూర్ ప్రాంతానికి తరలిస్తామని స్పష్టం చేశారు. రేడియల్ రోడ్లు నిర్మిస్తామని.. పోర్టుకు అనుసంధానంగా రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని తెలిపారు.
రెట్టింపు ఆదాయం..
తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి అని.. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారని సీఎం చెప్పారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు కోరిన వసతులు కలి్పస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి రెండు నెలలకోసారి, తాను మూడు నెలలకోసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణను తమ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం సూచించారు.
డిమాండ్ ఉన్న కోర్సులే..
ఏఐ సునామీతో వైట్‌కాలర్ ఉద్యోగాలు పోతున్నందున తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పామని చెప్పారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని.. వాటిలో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు వచ్చాయన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని చెప్పారు. డేటా సెంటర్లపై అమెజాన్ రూ. లక్ష కోట్లు, అదానీ రూ. 35 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయని వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ ఉత్తరాది వైస్ చైర్మన్ శారదా సూరి మార్వా తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక విధానాలకు ఆకర్షితులమయ్యాం..
తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండటంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చాం.
– పునీత్ కౌరా, సీఐఐ ఉత్తరాది చైర్మన్


