హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో ఏటా సుమారు 50–100 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు టాటా స్టార్‌బక్స్ సీఈవో సుశాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 80 పైచిలుకు నగరాల్లో 500 పైగా స్టోర్స్ ఉన్నట్లు ఆయన వివరించారు. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న వినియోగదారుల అల వాట్లు మొదలైన అంశాలు దేశీయంగా కాఫీ వినియోగం పెరగడానికి తోడ్పడనున్నాయని సుశాంత్ పేర్కొన్నారు.
మెట్రో నగరాలు, వ్యాపార వృద్ధికి అధిక అవకాశాలు ఉన్న పట్టణాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ప్రీమియం శ్రేణికి చెందిన ’రిజర్వ్’ కాఫీహౌస్‌ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది ఆరో రిజర్వ్ కాఫీహౌస్ కాగా, దక్షిణాదిలో మొట్టమొదటిదని సుశాంత్ వివరించారు. ఇది ఆగస్టు 1 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఇవి ఉన్నాయి.
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇటీవలి క్యూ1 నివేదిక ప్రకారం టాటా స్టార్‌బక్స్ ఆదాయం 11 శాతం వృద్ధి చెందిందని సుశాంత్ చెప్పారు. కంపెనీలో దేశీయంగా దాదాపు 4,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు వివరించారు. టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, స్టార్‌బక్స్ కాఫీ కంపెనీకి చెరి సగం వాటాలతో జాయింట్ వెంచర్ సంస్థగా టాటా స్టార్‌బక్స్ కార్యకలాపాలు సాగిస్తోంది.


