జూరాల నుంచి 24 క్రస్టు గేట్ల ద్వారా దిగువన ఉన్న శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
జూరాల 24 క్రస్టు గేట్ల ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/అచ్చంపేట: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 1.22 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. కృష్ణానది వరద ప్రవాహాన్ని బట్టి ఉదయం నుంచి క్రమక్రమంగా క్రస్టు గేట్ల సంఖ్యను పెంచుతూ నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు 24 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 95, 592 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 35,502 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.01 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
⇒ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రాజెక్టుకు జూరాల నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 1,31,094 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 834.40 అడుగులతో 54 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు.


