● జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 10 గ్రామాల ఎంపిక
● క్షేత్రస్థాయిలో సహకరించనిలైసెన్స్‌డ్ సర్వేయర్లు
● కేవలం 13 మందిప్రభుత్వ సిబ్బందితో కొనసాగింపు
నాగర్‌కర్నూల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వే సవ్యంగా సాగడం లేదు. సర్వేయర్ల కొరత ఉండటంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లతో వేగంగా గ్రామాల్లో భూమి హద్దులు, మ్యాపులు, ప్రభుత్వ భూమి గుర్తించాలని నిర్ణయించారు. ముందుగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 4 గ్రామాలు ఎంపిక చేసి రీసర్వేకు గ్రామసభలు నిర్వహించి.. ఆ తర్వాత మరో 70 గ్రామాలను గుర్తించారు. వాటిలో చిన్న కమతాలు ఉన్న గ్రామాలను ఎంపిక చేసి అక్కడ సైతం గ్రామసభలు పెట్టి భూ రీసర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. మొత్తం ఎంపిక చేసిన పది గ్రామాల్లో గ్రామసభలు పూర్తి కాగా.. రీ సర్వేకు వెళ్లే సమయంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు సహాయ నిరాకరణ చేపట్టారు. తమకు న్యాయమైన వేతనాలు ఇస్తేనే వస్తామని మొండికేయడంతో ప్రభుత్వం ఇక్కట్లో పడినట్లయింది. జిల్లాలోని 350 గ్రామాల్లో 11,67,725 ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామాలన్నింటిలో సర్వే చేయాల్సిన అవసరం ఉంది.
గ్రామసభలు పూర్తి..
ప్రభుత్వం జిల్లాలో భూమి రీసర్వే కోసం పది డీజీపీఎస్ యంత్రాలు మంజూరు చేసింది. ఇది సర్వే వేగంగా చేయడంతోపాటు భూమి సరిహద్దులను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. మొత్తం పది యంత్రాలు ఉండటంతో ఏకకాలంతో పది గ్రామాల్లో రీసర్వే చేయవచ్చు. దీంతో పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా ఎంపిక చేసిన నాలుగు గ్రామాలు తిమ్మాజిపేట మండలంలోని మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్, లింగాల మండలం అంబటిపల్లి, కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామాలు ఎంపిక చేసి గ్రామసభలు సైతం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంపిక చేసిన 70 గ్రామాల్లో మరో ఆరు గ్రామాలు రీసర్వేకు ఎంపిక చేసుకున్నారు. ఇందులో అచ్చంపేట మండలం చెన్నారం, అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్, కల్వకుర్తి మండలం బెక్కర, తాడూరు మండలం అంతారం, వెల్దండ మండలం కర్వెన్నపల్లి, చారకొండ మండలంలోని కమాల్‌పూర్ గ్రామాలను ఎంపిక చేసి గ్రామ సభలు పూర్తి చేసి భూ సర్వేను సైతం ఆరంభించారు.
జిల్లాలో 256 మంది..
భూముల రీ సర్వే చేయాలని, రిజిస్ట్రేషన్ సమయంలో భూమి కొలతలు వేసి మ్యాపులు గీసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసి వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు సైతం ఇచ్చింది. ఇలా జిల్లాలో 256 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేశారు. వారిని భూమి రీ సర్వేలో ఉపయోగించుకోవాలని నిర్ణయించగా వారు తమకు నెలవారిగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ.50 ఇస్తామని చెప్పగా.. ముందుకు రాకపోవడంతో కలెక్టర్ వారితో సమావేశం ఏర్పాటు చేసి ఎకరాకు రూ.60 ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో 13 మంది ప్రభుత్వ సర్వేయర్లు మాత్రమే భూ సర్వే చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.


