కందనూలు: బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహించిన తనిఖీల్లో బాలకార్మికులు, అనాథలుగా ఉన్న 60 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 42 మంది బాలురు, 18 మంది బాలికలు ఉండగా.. వీరిలో 8 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు ఉన్నారన్నారు. రెస్క్యూ చేసిన పిల్లల్లో 52 మందిని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా అప్పగించగా.. మిగిలిన 8 మంది చిన్నారులను పునరావాసం కోసం స్టేట్ హోంకు తరలించామని చెప్పారు. చదువుకోవాల్సిన వయసులో పిల్లలతో పనులు చేయించే యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ శంకర్, డీసీఆర్బీ ఎస్‌ఐ రమేష్, ఎస్‌బీఐ రాంలాల్, ఉమెన్ ఎస్‌ఐ ఇందిరమ్మ, ఏఎస్‌ఐ విజయలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ అధికారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పునరావాస
లబ్ధిదారులకు భూసర్వే
పెద్దకొత్తపల్లి: మండలంలోని బాచారం గ్రామానికి పునరావాసానికి వచ్చే లబ్ధిదారులకు ఒక కుటుంబానికి ఐదెకరాల భూమి కేటాయింపు కోసం భూమిని శుక్రవారం జిల్లా సర్వేయర్ గిరిధర్, మండల సర్వేయర్ బాబు ఫారెస్టు భూమి మ్యాపులను పరిశీలించారు. అమ్రాబాద్ అభయారణ్యం పులుల రక్షిత ప్రాంతం నుంచి మొదటి విడతలో 257 కుటుంబాలు పునరావాసానికి వచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు, 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. లబ్ధిదారులకు డిప్ పద్ధతిలో ప్లాట్లు కూడా కేటాయించారు. పాఠశాల, దేవాలయం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పులుల అభయారణ్యం ప్రాంతాల నుంచి సార్లపల్లి, చింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాలు, వటువర్లపల్లి గ్రామాల నుంచి 1,400 కుటుంబాలను పునరావాసానికి తరలించాల్సి ఉంది. మొదటి విడతలో 417 కుటుంబాలకు గాను 257 కుటుంబాలు పునరావాసానికి తరలిరావడానికి అంగీకార పత్రాలు అందజేశారు. 160 కుటుంబాలు పునరావాసానికి వచ్చే ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ సర్వే చేసి పట్టాలు అందించడానికి సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


