సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, TET నిబంధనల్లో తగిన సడలింపులు కల్పించి వారికి న్యాయం చేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (STF), తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ మేరకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (SVK), దొడ్డి కొమరయ్య హాల్‌లో ఈరోజు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల TET సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఇప్పటికే సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, వారి అనుభవాన్ని విస్మరించకుండా TET విషయంలో తగిన సడలింపులు కల్పించాల్సిన అవసరం ఉందని STF రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వారి సుదీర్ఘ సేవలను పరిగణనలోకి తీసుకొని TET అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించడంతో పాటు, సబ్జెక్టు వారీగా ప్రశ్నపత్రాలు, ప్రత్యేక సడలింపులు కల్పించి, ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి రీ-నోటిఫికేషన్ జారీ చేయాలని సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ప్రస్తుత TET నిబంధనల కారణంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రధాన డిమాండ్లను ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ప్రధాన డిమాండ్లు
1. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలి.
2. ఉపాధ్యాయులు ప్రస్తుతం బోధిస్తున్న సబ్జెక్టు ఆధారంగా సబ్జెక్టు వారీగా TET ప్రశ్నపత్రాలు రూపొందించి పరీక్ష నిర్వహించాలి.
3. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET విషయంలో ప్రత్యేక సడలింపులు/మినహాయింపులు కల్పించాలి.
4. ఇప్పటికే జారీ చేసిన ఇన్-సర్వీస్ TET నోటిఫికేషన్‌లో అవసరమైన సవరణలు చేసి రీ-నోటిఫికేషన్ జారీ చేయాలి.
5. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సుదీర్ఘ అనుభవం, బోధనా సేవలను పరిగణనలోకి తీసుకొని TET నిబంధనలను సహేతుకంగా సవరించి వారికి న్యాయం చేయాలి.
ఈ సమావేశంలో STF రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి U. పోచయ్య, నాన్ టెట్ టీచర్స్ ఫోరం కన్వీనర్ ఎండీ అమీర్ పాషా, కో-కన్వీనర్ బి.ఎన్. రెడ్డి, TRTF హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. విజయభాస్కర్‌తో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


