ఇందిరమ్మ టవర్స్‌కు భారీ స్పందన
దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు
ఈనెల 20 తర్వాత లాటరీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో క్యూర్ పరిధిలో తలపెట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకానికి భారీ స్పందన వస్తోంది. ఈ ఫ్లాట్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇందిరమ్మ టవర్స్ కింద మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ ఇళ్ల కోసం శనివారం సాయంత్రానికి 35,125 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో విలువైన భూముల్లో నిర్మిస్తున్న ఈ ఇండ్లను కేవలం నామమాత్రపు ధరకే అందిస్తున్నట్లు వివరించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.30 లక్షల నుంచి రూ.58లక్షల వరకు ధర పలికే ఈ ఫ్లాట్లను ప్రజల సంక్షేమం కోసం వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న ఉద్దేశంతో కేవలం రూ.6 లక్షల రూపాయలకే ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన తెలిపారు. అంతే కాకుండా ఇళ్లు పొందిన వారికి రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు.
ఇళ్లు కేటాయించని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు ఫీజు రూ.10వేలు తిరిగి చెల్లిస్తామన్నారు. దరఖాస్తులను సమర్పించడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈ నెల 20 వ తేదీ నుంచి చేపట్టాలని హౌసింగ్ బోర్డు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ఇళ్లన్నింటినీ ఒక ఏడాది లోపే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వి.పి.గౌతం వెల్లడించారు. ఇందిరమ్మ టవర్స్ కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ఫోన్ నంబరు 040–24603572ను సంప్రదించవచ్చు.


