అనుమానాస్పద స్థితిలో నేతన్న మృతి | Netanna dies under suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో నేతన్న మృతి

Aug 9 2026 4:17 AM | Updated on Aug 9 2026 4:17 AM

Netanna dies under suspicious circumstances

ఇందిరమ్మ ఇంటి విషయంలో వివాదం

మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌పై ఇటీవల ఫిర్యాదు

మూడు రోజుల క్రితం మిస్సయిన వెంకటేశం  

సిరిసిల్లటౌన్‌: తనకున్న పూరిల్లును ఇందిరమ్మ పథకం ద్వారా పక్కా ఇంటిగా నిర్మించుకునేందుకు నిబంధనలు అడ్డురావడం.. ప్రజాప్రతినిధి రూ.లక్ష డిమాండ్‌ చేయడం.. ఈ క్రమంలో రాజకీయ నేతతో వైరం ఏర్పడడం.. చివరికి నేతన్న జీవితం విషాదాంతం కావడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం మిస్సయిన వెంకటేశం శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు.  

రగుడు గుట్టపై శవమై.. 
స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలోని తారకరామానగర్‌కు చెందిన వెంగళ వెంకటేశం (49) కుసుమ గణేష్‌ అనే ఆసామి వద్ద పనిచేసేవాడు. భార్య సులోచన. వీరికి ఓ కూతురు. కాగా, ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వెంకటేశం.. ఈ విషయమై మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌ను సంప్రదిస్తే.. ఆయన డబ్బులు డిమాండ్‌ చేసినట్లు గతంలో ఆరోపించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నిజనిర్ధారణ కోరుతూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దార్ల సందీప్‌పై కేసు నమోదైంది. 

ఈ క్రమంలోనే గురువారం ఉదయం వెంకటేశం కనిపించకుండా పోయాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెంకటేశం పనిచేసే ఆసామి కుసుమ గణేశ్‌ను విచారించగా.. గురువారం మల్లికార్జునస్వామి గుడికి వెళ్దామని తనను తీసుకొచ్చాడని, అయితే గుట్టమీదకు తాను రాలేనని చెప్పడంతో ఒక్కడే వెళ్లాడన్నాడు. అనంతరం అక్కడి నుంచి తాను ఇంటికొచ్చినట్లు తెలిపాడు. 

వెంకటేశం మరణం..అనుమానాస్పదం 
మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన వెంకటేశం రగుడు శివారులోని మల్లికార్జునస్వామి ఆలయం గుట్ట పరిసరాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. గుట్టపై వెంకటేశం చనిపోయన విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి విషయంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌తో వైరం ఉంది. అతని భార్య సులోచన ఇచ్చిన ఫిర్యాదులోనూ దార్ల సందీప్‌పై అనుమానాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా, వెంకటేశం సూసైడ్‌ నోట్‌ విషయంలో పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. మృతుడి వద్ద కాగితాలు లభించాయని వాటిలో ఏమి లేదని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement