మిగిలింది ఒక్క రోజే ! | - | Sakshi
Sakshi News home page

మిగిలింది ఒక్క రోజే !

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

● 87.58 శాతం డిజిటలైజేషన్‌ ● రేపటితో ముగియనున్న సర్‌ ప్రక్రియ ● ఇంకా అందని పత్రాలు 59,076

● 87.58 శాతం డిజిటలైజేషన్‌ ● రేపటితో ముగియనున్న సర్‌ ప్రక్రియ ● ఇంకా అందని పత్రాలు 59,076

సిరిసిల్ల: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఆగస్టు 10వ తేదీతో ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 87.58 శాతం పూర్తయింది. జిల్లాలో బూత్‌ లెవర్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు వంద శాతం లక్ష్య సాధనపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి 4,75,694 ఎన్యూమరేషన్‌ పత్రాలను పంపిణీ చేయగా.. వాటిని సేకరించి డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయపక్షాల కోరిక మేరకు ఇప్పటికే రెండుసార్లు గడువును పొడగించారు. ఆగస్టు 10వ తేదీ చివరి అవకాశంగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో ఎస్‌ఐఆర్‌కు ఒక్క రోజే గడువు మిగిలింది.

ఊరికే ‘మన ఓటు’

బతుకుదెరువు కోసం, వ్యాపారం, ఉపాధి కోసం, పిల్లల చదువుల కోసం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో స్థిరపడిన వారు గ్రామాల్లోనే ఓటుహక్కు ఉండాలని భావిస్తున్నారు. రెండు చోట్ల ఓటుహక్కు ఉన్న వారి పేర్లు తొలగించే ప్రక్రియ మొదలవడంతో పల్లెలోనే ఓటుహక్కును కలిగి ఉండాలని మెజార్టీ ఓటర్లు భావిస్తున్నారు. ఎన్యూమరేషన్‌ పత్రాలను పొందిన ఓటర్లు ఊరిలోనే ఆధార్‌కార్డు, 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని, కొత్త ఫొటోను అందిస్తున్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,29,132 మంది ఓటర్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో 2,46,562 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు డబుల్‌ ఓట్లకు చెల్లు చీటి ఇస్తూ.. ఒకే ఓటుకు చాన్స్‌ ఇవ్వడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఓటర్ల సంఖ్య తగ్గనుంది. సిరిసిల్ల పట్టణంలో ఓటుహక్కు ఉన్న వారిలో చాలా మంది తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్‌ నగర్‌లోనూ ఓటర్లుగా ఉన్నారు. ఇలా రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న వారికి ఒకే అవకాశం ఇవ్వడంతో ఊరిలోనే ఓటు వేయాలని భావిస్తున్నారు. సర్‌(ఎస్‌ఐఆర్‌) మ్యాపింగ్‌ ప్రక్రియతో బోగస్‌ ఓటర్లు తొలగిపోనున్నారు.

అక్టోబరు 12న తుది ఓటర్ల జాబితా

ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించి.. సమగ్రమైన జాబితాను సిద్ధం చేసే దిశగా జిల్లా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ నాటికి ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తికానుంది. సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబరు 8వ తేదీ నాటికి అభ్యంతరాలను పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 12న వెల్లడిస్తారు.

బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు : 549

ఓటర్లు : 4,75,694

ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ : 4,75,694

ఇంకా అందని ఎన్యూమరేషన్‌ పత్రాలు : 59,076

డిజిటలైజేషన్‌ : 4,16,618

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ స్వరూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement