అడుగుదూరంలో అలుగు
మిడ్‌మానేరులో 20.538 టీఎంసీలు
సిరిసిల్ల/గంభీరావుపేట/బోయినపల్లి: జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశ యం అడుగు దూరంలో మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉంది. జలాశయం నీటిమట్టం 1,482.50 అడుగులు కాగా.. శనివారం రాత్రి వరకు 1,381.50 అడుగులకు చేరింది. మరో ఫీటు నీరు చేరితే మత్తడి దూకనుంది. బోయినపల్లి మండలం మధ్యమానేరు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.538 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి, మూలవాగు, మానేరువాగుల ద్వారా 15,774 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా కరీంనగర్ ఎల్‌ఎండీకి 1,793 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ పూర్తిస్థాయి నీటి మట్టం 3.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.509 టీఎంసీలకు చేరింది. 91 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తోంది. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరుంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం దూకుతుంది. జిల్లాలోని 656 చెరువులోకి కొద్దిగా వరద నీరు చేరుతోంది.
వేములవాడలో అధిక వర్షం
జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. వేములవాడలో అత్యధికంగా 23.7 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 0.7, చందుర్తిలో 7.9, వేములవాడ రూరల్‌లో 0.4, బోయినపల్లిలో 0.4, సిరిసిల్లలో 7.4, వీర్నపల్లిలో 0.5, గంభీరావుపేటలో 13.2, ముస్తాబాద్‌లో 1.7, తంగళ్లపల్లిలో 1.5, ఇల్లంతకుంటలో 6.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. కోనరావుపేట, ఎల్లారెడ్డిపేటల్లో పెద్దగా చినుకులు పడలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు మండలా ల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం పడగా.. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
అప్రమత్తంగా ఉండాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్టు నిండుకుండలా మారిందని.. ఎప్పుడైనా మత్తడి దూకే అవకాశం ఉందని ఇరిగేషన్ ఏఈ నవీన్‌కుమార్ తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని ఎగువమానేరు పరివాహక గ్రామాలు కొండాపూర్, రామలక్ష్మణపల్లి, ఆవునూర్, తుర్కపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగు సమీపంలోని వ్యవసాయభూములు ఉన్న రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.


