తొమ్మిదేళ్ల పిల్ల తన పాఠశాల హోంవర్క్‌లు, ఆటలతో గడుపుతుంటారు. కానీ ఈ చిన్నారి అందరి పిల్లల్లా కాదు. వయసుకు మించిన పరిణితి, ఆలోచనలతో ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే ఆవిష్కర్తగా కళాకారిణిగా, రచయిత్రిగా, ప్రపంచ పౌరురాలిగా అద్భుతమైన ప్రతిభ చాటుతోంది. ఆ చిన్నారి సక్సెస్ జర్నీ కేవలం తన ప్రతిభా సామర్థ్యాలనే కాదు, ఆ స్థాయిలో రాణిస్తున్న ఆమె విజయం వెనుక ఉన్న అద్భుతమైన పేరేంటింగ్ విధానం గురించి కూడా నొక్కి చెబుతోంది. ఇంతకీ ఎవరా ఆ చిచ్చరపిడుగు అంటే..
ఆ చిన్నారే రితన్యా కౌశిక్. ఢిల్లీకి చెందిన ఆమె సాధించిన విజయాలు పెద్దవాళ్లకే చాలా ఏళ్లు పడతాయి. కానీ ఈ చిచ్చరపిడుగు అలవోకగా సాధించేసింది. చిన్న వయసులోనే రచయిత్రిగా మారి అమెజాన్‌లో లభించే 'మై విండో టు ది వరల్డ్' అనే పుస్తకం రాసేసింది. అలాగే పదేళ్లు నిండక మునుపే అంతర్జాతీయ ఆవిష్కరణల పోర్ట్‌ఫోలియోను నిర్మించింది. ఆమె తన మేథా సంపత్తితో బహుళ దేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. ఏయే దేశాల్లో అంటే..
యునైటెడ్ కింగ్‌డమ్‌లో డిజైన్ పేటెంట్
జర్మనీలో యుటిలిటీ మోడల్
కెనడాలో కాపీరైట్
భారతదేశంలో దాఖలు చేసిన పేటెంట్
అంతేగాదు ఇటీవలే, ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రత్యేక ఏజెన్సీ ద్వారా రితన్యాని ఆహ్వానిత వక్తగా, ప్యానలిస్ట్‌గా పరిగణించడం విశేషం. ఆమె ఆవిష్కరణలు అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతో ముడిపడి ఉండటం విశేషం. సృజనాత్మకతలో కూడా తగ్గేదేలే అంటూ తన కళాకృతులతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విషయంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 'స్కెచ్ ఫర్ సర్వైవల్'నుంచి సర్టిఫికేట్ అందుకుంది. అక్కడ ఆమె వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడానికి కళను ఉపయోగించింది. అలాగే స్విట్జర్లాండ్‌లోని 'ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ (IBBY)' కూడా తన కళాకృతులను ప్రదర్శించింది.

అక్కడ ఆమె కళాకృతులు వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలతో అనుసంధానం కాగల ముఖ్యమైన ఆలోచనలను తెలియజేశాయి. క్రియేటివిటీ పరంగా భారత్‌లో బ్రిటిష్ లైబ్రరీ నుంచి పొందిన సర్టిఫికేట్, అలాగే ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ రచనా పోటీలలో ఒకటైన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ 2025'లో పాల్గొనడం వంటివి ఉన్నాయి.
దీంతోపాటు విద్యాపరంగా కూడా అత్యుత్తమమైన ప్రతిభ కనబరుస్తోందామె. అక్కడితో ఆమె విజయాలు ఆగలేదు. ఆమె స్పెల్లింగ్ బీ పోటీలో అంతర్జాతీయ అత్యుత్తమ సర్టిఫికేట్‌ను సంపాదించింది. అలాగే క్రీడాల్లో కూడా రాణిస్తోందామె. వీటి తోపాటు తైక్వాండోలో గ్రీన్ బెల్ట్ నుంచి యుద్ధకళల్లో సైతం జిల్లా స్థాయిలో ప్రతిభను కనబర్చడం వరకు అన్నింటిలో తన సత్తా చాటింది.
ఆమె సక్సెస్ జర్నీ వెనుకున్న కుటుంబ మద్ధతు..
రితన్యకు ఈ అసాధారణ ప్రతిభ ఆమె కుటుంబం నుంచ వచ్చింది. తల్లి స్మిత శర్మ కౌశిక్, ఢిల్లీ విశ్వవిద్యాలయం టాపర్. తండ్రి, డాక్టర్ భరత్ కౌశిక్, ఒక ఆవిష్కర్త, అలాగే యూఎస్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థి. ఆమె అమ్మమ్మ మధు కౌశిక్, ఒక ప్రచురిత రచయిత్రి, కాగా ఆమె తాతయ్య ఇస్రోలో సైంటిస్టు, పైగా చంద్రయాన్ తోడ్పాటుకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. కుంటుంబ సభ్యులంతా ఉన్నత విద్యావంతులు కావడం తోపాటు ఆ చిన్నారిని ఎలాంటి ఒత్తిడికి తావివ్వకుండా స్వేచ్చగా ప్రోత్సహించారు.
అలాగే ఆమె ఆశక్తులను గమనిస్తూ ఆ దిశగా ప్రోత్సహించారు. ఆమె ఆలోచనలకు అనుగుణంగా సలహాలు, సూచనలందించి..ఆమెలోని అపార ప్రతిభను వెలికి తీశారు. ఇక్కడ రితన్య తల్లిదండ్రులు ఆమె ఆసక్తికి అనుగుణంగా ఉత్సాహం, పట్టుదల, ప్రోత్సాహాలను అందించారు. అందువల్ల రితాన్య అద్భుతమైన ప్రతిభ పాటవాలను కనబర్చింది.
ఈ విధంగా మన పిల్లలను ప్రోత్సహిస్తే కచ్చితంగా ఏదో ఒక రంగంలో రాణిస్తారు. అలాగే వాళ్ల ఇష్టాలు ఆసక్తులపై ఒక విధమైన అవగాహన కూడా ఏర్పడటం తోపాటు వాళ్ల అభ్యున్నతికి మార్గం సులభవుతుందనే గొప్ప పేరెంటింగ్ పాఠాన్ని నేర్పిస్తోంది ఈ చిన్నారి సక్సెస్ కథ.
(చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్..)


