ఎంత ప్రయత్నం చేస్తే.. అంత మేలు | Parenting Tips: Aparna mother of child artist Dhruvan Satya Varma Advice | Sakshi
Sakshi News home page

ఎంత ప్రయత్నం చేస్తే.. అంత మేలు

Jun 28 2026 7:55 AM | Updated on Jun 29 2026 9:29 AM

Parenting Tips: Aparna mother of child artist Dhruvan Satya Varma Advice

వయసు పదకొండు. విమానం, రావణాసుర, స్కైలాబ్‌.. ఇలా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలు నలభై నాలుగు; నేషనల్‌ రెజ్లింగ్‌లోనూ రెండు గోల్డ్‌ మెడల్స్‌; చదువులోనూ టాపర్‌. హైపర్‌ యాక్టివిటీని కరెక్ట్‌గా ఉపయోగిస్తే పిల్లలు మల్టిపుల్‌ టాలెంట్స్‌తో రాణించవచ్చు అంటున్నారు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ధృవన్‌ సత్య వర్మ తల్లి పాతపాటి అపర్ణ. పిల్లల పెంపకంలో తను తీసుకుంటున్న జాగ్రత్తలను ఆమె ఇలా వివరించారు.

‘‘మా ధృవన్‌ నేషనల్‌ రెజ్లర్‌. అండర్‌ లెవన్‌ రెజ్లింగ్‌లో తెలంగాణకు రెండు గోల్డ్‌ మెడల్స్‌ తీసుకొచ్చాడు. వైజాగ్‌లో జరిగిన రెజ్లింగ్‌ సెమీనేషనల్, నేషనల్‌లోనూ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. నేను, మా వారు రామరాజు కాలేజీ రోజుల్లో స్టేట్‌ లెవల్‌లో స్పోర్ట్స్‌లో రాణించిన వాళ్లమే! పిల్లలు స్పోర్ట్స్‌లో రాణిస్తే, ఆ ఫైటింగ్‌ ధోరణి జీవితంలోనూ పనికివస్తుందనేది మా ఆలోచన. అందుకే పిల్లలు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. పిల్లలు పెరుగుతున్నప్పుడే వారిలో యాక్టివిటీస్‌ మనకు వారి చర్యల ద్వారా తెలుస్తుంటాయి. వారి తెలివితేటలను గమనిస్తూ, తగిన అవకాశాలను కల్పించాలనుకుంటున్నాం. 

సహనంగా ఉండటం గమనించాను.. 
సినిమాలు చూసి అందులో హీరోలా డైలాగ్స్‌ చెప్పడం, డ్యాన్స్‌ చేయడం గమనించాను. ధృవన్‌ ఏదైనా చేయాలనుకుంటే చాలా సహనంగా ఉండటమూ గమనించాను. స్పోర్ట్స్‌ మీట్‌కు తీసుకెళ్లినా, షూటింగ్స్‌కు వెళ్లినా అక్కడ తన టైమ్‌ వచ్చేంతవరకు ఓపికగా ఉంటాడు. ఆ సహనమే 500కు పైగా ఆడిషన్స్‌లో పాల్గొనేలా చేసింది. దీంతో టీవీలో రియాలిటీ షోష్‌కి, సినిమా ఆడిషన్స్‌కు తీసుకెళ్లేదాన్ని. దానిని ధృవన్‌ బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌లో ఉండగానే సినిమా ఆడిషన్స్‌కు తీసుకెళ్లాను. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత పుష్ప, విమానం... ఇలా 44 సినిమాలకు పైగా నటించాడు. 

మెరుగులు దిద్దితేనే మెరుస్తారు
పెళ్లికి ముందు జాబ్‌ చేసేదాన్ని. పిల్లలు పుట్టాక జాబ్‌ మానేశాను. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఇంటి వద్ద నుంచే వర్క్‌ చేస్తున్నాను. మా వారిది బిజినెస్‌ రంగం. మేం ఉండేది హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తాం. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంకు వెళ్లిపోతాం. పాప, బాబు ఇద్దరూ రెజ్లింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. తిరిగి వచ్చి, స్కూల్‌కు వెళ్లిపోతారు. సాయంత్రం ఇంటికొచ్చిన గంటసేపటికి స్టేడియంలో ఉంటారు. షూటింగ్స్‌ డేట్‌ వైజ్‌ షెడ్యూల్‌ ఉంటుంది కాబట్టి, దానికి తగిన విధంగా ప్లాన్‌ చేసుకుంటాం. 

సినిమా షెడ్యూల్‌కి కుదరడం లేదు అనుకున్నప్పుడు ప్రాక్టీస్‌కు బ్రేక్‌ తీసుకుంటాం. చదువులో కూడా టాప్‌ టెన్‌లో ఉంటాడు. సరిగా లేకపోతే ఒక్కోసారి సీరియస్‌గా ఉండే సందర్భాలూ ఉంటాయి. 3–4 రోజులు లీవ్‌ పెట్టాల్సి వస్తే వాళ్ల క్లాస్‌మేట్స్‌ నలుగురైదుగురు పిల్లలు వచ్చి మా ఇంట్లో ఉంటారు. ధృవన్‌ మిస్‌ అయిన సబ్జెక్ట్‌లు వాళ్లు చెబుతారు. అందరూ కలిసి చదువుకుంటారు. ఊరి వాతావరణం మిస్‌ కాకూడదని..

వారం రోజుల పాటు సెలవులు దొరికితే మాత్రం అమ్మనాన్నలు, అత్తయ్యవాళ్లతోనూ గడపడానికి వెళతాం. మాది వెస్ట్‌ గోదావరి భీమవరం దగ్గర నెలమూరు. అక్కడి ఊళ్లన్నీ తిప్పి, తీసుకువస్తాం. అక్కడి వాళ్లంతా ‘పుష్పరాజ్, పహిల్వాన్‌’ అని పిలుస్తుంటే చాలా ఎంజాయ్‌ చేస్తాడు. ఇంకా బాగా యాక్ట్‌ చేసి, ఊరిలో పెద్ద పేరు తెచ్చుకుంటానని చెబుతుంటాడు.

జంక్‌ఫుడ్‌కి నో..
నేను పెళ్లికి ముందు న్యూట్రిషన్‌ కోర్స్‌ చేశాను. స్కిన్‌ స్పెషలిస్ట్‌ వద్ద మూడేళ్లు వర్క్‌ చేశాను. ఇప్పుడా వర్క్‌ నాకు బాగా ఉపయోగపడుతోంది. ఫుడ్‌ మీద అవగాహన ఉండటంతో ఆ విషయాలు పిల్లలకు చెబుతాను. జంక్‌ ఫుడ్‌ అడిగితే– హీరో అంటే ఎలా ఉండాలో, ఎలాంటి ఫుడ్‌ తింటే ఎలా అవుతారో చెబుతాను. బాబు చదివేది స్వామినారాయణ్‌ గురుకుల్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌. ఆ స్కూల్‌లో జంక్‌ఫుడ్‌కి, నాన్‌వెజ్‌కి కూడా అనుమతి ఉండదు. ఇక స్పోర్ట్స్‌లో రెజ్లింగ్‌ కోచ్‌ చెప్పిన ఫుడ్‌కే ప్రయారిటీ. 

ప్రతి యేడాది మూడు నెలలు స్కూల్‌కి సెలవులు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలా అని ముందే ప్లాన్‌ చేస్తాం. పిల్లలిద్దరూ స్విమ్మింగ్, డ్యాన్స్, స్పోర్ట్స్,  సైక్లింగ్, గిటార్‌ ప్లే చేస్తుంటారు. సెలవులు కదా లీజర్‌గా గడిపేయాలనుకోం. దీని వల్ల పిల్లలు అన్నింట్లోనూ తమని తాము నిరూపించుకోవడం, ప్రాక్టీస్‌ చేయడం, కొత్తవి నేర్చుకోవడం వల్ల ఎప్పుడూ చురుగ్గా ఉండటం జరుగుతుంది. 
- నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement