మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో అజిత్ తర్వాత ఎన్‌సీపీ పగ్గాలు ఎవరికి?.. పార్టీని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అజిత్ మరణంతో ఎన్‌సీపీ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. అజిత్ వర్గం ఎన్సీపీ చీలకుండా.. బీజేపీ పక్కా వ్యూహం రచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
అయితే, పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతోపాటు.. ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పార్టీ బాధ్యతల విషయంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , కుమారుడు పార్థ్ పవార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీపీ అధికార పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇక, మహారాష్ట్రలో జరిగిన కీలక పరిణామాలను పరిశీలిస్తే.. శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. ఎన్నికల సంఘం నుంచి ఆయన తన పార్టీకి ఎన్‌సీపీ పేరుని, చిహ్నాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కావాలనే రాజకీయ ఆకాంక్షల కారణంగా అజిత్ పవార్.. శరద్ పవార్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ వర్గానికి 13-14 మంది మాత్రమే ఉన్నారు. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో సంబంధాలు ఇటీవల పెరిగాయి. రెండు పార్టీల ఏకీకరణ చర్చలు కూడా ఊపందుకున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 2026లో ఈ రెండు వర్గాలు పుణె, పింప్రి-చించ్‌వాడ్‌లో ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డాయి. శరత్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కాగా, రెండు వర్గాల మధ్య ఏకీకరణ జరిగితే శరద్ పవార్ వారసురాలిగా సుప్రియా సూలే ఉద్భవిస్తున్నారు. కానీ అజిత్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్ పేర్లు ఉండగా.. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్‌బాల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే వంటి బలమైన నాయకులు కూడా ఉన్నారు.
అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అతిజ్ పవార్ భార్య సునేత్రా పవర్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశం ఉంది.
అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్
అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్.. 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేనప్పటికీ.. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్‌లో పార్థ్ పవార్‌కు మంచి గుర్తింపు ఉంది.
ధనంజయ్ ముండే
అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ్ ముండే.. బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు.
కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్
ఎన్‌సీపీ వ్యవస్థాపక నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఒకరు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రముఖులతో కలిసి చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బీజేపీ వ్యూహమేంటి?
మరోవైపు.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మహారాష్ట్రపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. భవిష్యత్‌లో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడే అవకాశం ఉందని.. వారిలో కొందరు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్ళవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీనిని ఊహించిన బీజేపీ.. అజిత్ పవార్ కుటుంబం నుండి ఒకరికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని బీజేపీ వ్యూహకర్తలు కోరుకుంటున్నారు. ఇది అజిత్ పవార్ మద్దతుదారులకు భావోద్వేగ సందేశాన్ని పంపడమే కాకుండా మహాకూటమి చెక్కుచెదరకుండా ఉండేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, క్యాబినెట్‌లోకి ఒక మహిళా మంత్రి ప్రవేశించడం రాజకీయంగా కూడా ముఖ్యమైనది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బీజేపీ ఇప్పటికీ షిండే సేనతో సంప్రదించాల్సి ఉంటుంది.


