అన్ని ప్రభుత్వ భవనాలు రూ. వెయ్యి లీజుకే
పీసీబీ చైర్మన్‌కు చంద్రబాబు సర్కారు కానుక
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పేరుతో ధారాదత్తం
బీసీ, ఎస్సీ సామాజిక భవనాలు, టీటీడీ కళ్యాణ మండపం, ఆర్బీకే అప్పగింతకు రెడీ
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు..ప్రతిపాదనను విరమించుకోవాలని కలెక్టర్‌కు వినతి
తప్పదన్న కలెక్టర్.. ఆందోళనకు సిద్ధమవుతున్న గ్రామస్తులు
సాక్షి టాస్క్ ఫోర్స్: సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అతి తక్కువ ధరకు పప్పు బెల్లాల్లా అనుయాయులకు కట్టబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పల్లెల్లోనే ప్రజలకు సర్కారు సేవలందించేందుకు నిర్మించిన బీసీ, ఎస్సీ సామాజిక భవనాలు, టీటీడీ కల్యాణ మండపం, ఆర్బీకే వంటి ఖరీదైన భవనాలను దశాబ్దాల పాటు లీజు పేరుతో ధారాదత్తం చేస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఈ భవనాలన్నీ బాబు అనుయాయుల పరమవుతున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య బావమరిది పరమవుతున్నాయి. ఈ ప్రయత్నాలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వెంకన్నపురం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య స్వగ్రామం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో టీటీడీ నిధులతో కల్యాణ మండపం, డైనింగ్ హాలు నిర్మించారు. పంచాయతీరాజ్, ఎంపీ ల్యాడ్స్ (రాజ్యసభ సభ్యుడు), కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులతో 14,400 చదరపు అడుగుల స్థలంలో ఎస్సీ, బీసీ సామాజిక భవనాలు, మహిళా భవనం నిర్మించారు.
వీటిని గ్రామస్తులే కాక సమీపంలోని బసవాయపాళెం, దామేగుంట, గుండాలమ్మపాళెం, పద్మనాభసత్రం తదితర గ్రామాల ప్రజలు వినియోగించుకొంటారు. ఇక్కడి కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకొన్న వారు భోజనాలకు సమీపంలోని డైనింగ్ హాల్‌ను వినియోగిస్తారు. పొదుపు మహిళల సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మహిళా భవనాన్ని ఉపయోగిస్తున్నారు. బీసీ భవనంలో ఆర్బీకే ఉంది. ఎస్సీ సామాజిక భవనాన్ని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి నివాసానికి కేటాయించారు. తుపాను, వరదల్లాంటి విపత్తుల సమయంలో గ్రామంలోని వారు ఈ భవనాల్లోనే తలదాచుకొంటారు.
99 ఏళ్ల పాటు లీజు.. ఏడాదికి రూ. వెయ్యే!
తన స్వగ్రామంలోని ఈ ప్రభుత్వ భవనాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కన్ను పడింది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ సాకుతో వీటిని సొంతం చేసుకోవాలనుకొన్నారు. కృష్ణయ్య బావమరిది పి.లక్ష్మీ శ్రీనివాస ప్రసాద్ పేరుతో తొలుత 33 ఏళ్ల లీజు, తర్వాత మరో రెండు పర్యాయాలు 33 సంవత్సరాల వంతున ఏకంగా 99 ఏళ్లపాటు లీజు పొడిగించుకొనే వెసులుబాటుతో అన్ని భవనాలకు కలిపి ఏడాదికి కేవలం రూ.వెయ్యి అద్దె ప్రతిపాదనను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన పంపారు.
కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ కావడం, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఫైల్ చకచకా కదిలింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌కు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు చేరింది. కలెక్టర్ ఆమోదం పొందగానే డీపీఓకు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులందాయి. వెంటనే భవనాలను స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధమైపోయారు. ఈ విషయం గ్రామస్తులకు చేరడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగించుకొనే ప్రభుత్వ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారంటూ మండిపడ్డారు.
సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా గ్రామాభివృద్ధిపై సమీక్ష సమావేశానికి మంగళవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ప్రభుత్వ భవనాలను ప్రైవేటు పరం చేయొద్దని గట్టిగా కోరారు. కలెక్టర్ నుంచి వారికి సానుకూల సమాధానం రాలేదు.
గ్రామంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు. దానికి ఒక భవనం సరిపోతుందని, ఇన్ని అవసరం లేదంటూ గ్రామస్తులు చెప్పారు. ఇదంతా పెద్ద కుట్ర అని, దీనికి సమ్మతించేది లేదని, ఉద్యమం తప్పదని తెగేసి చెప్పారు.
అసౌకర్యమైన చోట స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటేమిటి?
వెంకన్నపురం గ్రామానికి ఇరువైపులా ఉన్న రోడ్లు దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. సొంత వాహనాలు తప్ప రవాణా సౌకర్యం ఉండదు. ఇక్కడే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెడతామనడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇదే మండలంలో జాతీయ రహదారికి ఆనుకొని చంద్రశేఖరపురం వద్ద ఇదే కృష్ణయ్య ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కు ఉంది.
అందులో కావాల్సినంత స్థలం ఉందని, అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ గ్రామంలోని ప్రభుత్వ భవనాలను చెరబట్టడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇంతకంటే దారుణం లేదు
గ్రామంలో 60 శాతం పేద ఎస్సీలే. వీరి అవసరాలకు గ్రామంలోని ప్రభుత్వ భవనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ భవనాలను ప్రభుత్వ పెద్దల అండతో హస్తగతం చేసుకోవడం దారుణం. కలెక్టర్ కూడా వారికే సహకరించడం విడ్డూరంగా ఉంది. దళితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది. – బండి పెంచలయ్య, సర్పంచ్, వెంకన్నపురం


