ప్రజల ముందుకు ప్రాథమిక నోటిఫికేషన్
7 రోజుల వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ
బల్దియా కార్యాలయాలు, వెబ్‌సైట్‌లో వివరాలు
కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాలు, నియోజకవర్గాల పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు.
తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేసినట్లు చెప్పారు. విస్తరించిన పరిధితో 300 వార్డులుగా డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించారు. వివరాలు జీహెచ్‌ఎంసీ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చన్నారు. ప్రజలు, పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలోనూ వీటిని స్వీకరిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సభ్యుల సూచనలూ పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చాలా వార్డులకు సరిహద్దులు మారాయి. కొన్ని పాత వార్డులు రెండు వార్డులయ్యాయి. కొన్ని గల్లంతయ్యాయి.
ఇదీ ప్రాథమిక నోటిఫికేషన్..
కాలానుగుణంగా సవరించి 6.11.1996న ప్రభుత్వం జారీ చేసిన జీఓ (నెంబర్ 570), తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996లోని నిబంధన 8 మేరకు, ఈ నెల 8న జారీ అయిన జీఓ (నెంబర్ 266) ననుసరించి జీహెచ్‌ఎంసీ ప్రాంతాన్ని 300 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ స్థానికులకు తెలియజేయడమైనదంటూ ప్రాథమిక నోటిఫికేషన్ పేరిట వెలువరించిన ప్రకటనలో పేర్కొన్నారు.
సరిహద్దు వివరణల వివరాలను జీహెచ్‌ఎంసీ అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలో నోటీసు బోర్డులపై ఉంచినట్లు తెలిపారు. వివరాలు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ (ఠీఠీఠీ.జజిఝఛి.జౌఠి.జీn)లో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ నివాసితులు ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలుంటే ఈ నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ (9.12.2025) నుంచి 7 రోజుల్లోపు దాఖలు చేయాల్సిందిగా కమిషనర్ కోరారు.

ఇంతింతై.. మహా నగరమంతై..
హైదరాబాద్ నగర పరిపాలన నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర. ఒక పరిణామ క్రమం. 1800 కాలంలో చిన్నపాటి మున్సిపల్ బోర్డులతో మొదలైన వ్యవస్థ.. ప్రస్తుతం 27 స్థానిక సంస్థల విలీనంతో మరింతగా విస్తరించింది. బల్దియా పరిణామ క్రమమిలా.. చారిత్రక దశలు
1869: నిజాం కాలంలో కొత్వాల్–
ఎ–బల్దియా ఆధ్వర్యంలో నగర పరిపాలన.
1886: చాదర్‌ఘాట్ ప్రత్యేక మున్సిసిపాలిటీ.
1921–1933: హైదరాబాద్ బోర్డు + చాదర్‌ఘాట్ బోర్డు కలిపి మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్పు.
1934: తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు.
1942–1951: సికింద్రాబాద్ మున్సిపాలిటీ.. అనంతరం కార్పొరేషన్‌గా మార్పు.
జీహెచ్‌ఎంసీ ఏర్పాటు..
2007: శివార్లలోని 12 మున్సిపాలిటీల
విలీనంతో గ్రేటర్ హైదరాబాద్
మున్సిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ).
çపరిధి: 650 చ.కి.మీ.
6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు.
ప్రస్తుతం: శివార్లలోని 12 మున్సిపాలిటీలు,
7 కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్‌ఎంసీలోని 150 నుంచి 300 వార్డులకు పెరుగుదల.
ఈ పరిణామ క్రమంలో ఒకప్పటి నిజాం రాజధాని, ఇప్పుడు గ్లోబల్ మెట్రోపాలిటన్‌గా మారింది. నగర పరిపాలన మరింత విస్తరించింది. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు. హైదరాబాద్ భవిష్యత్ దిశలో ఇది ఒక
నూతనాధ్యాయం.





