breaking news
Osmania Arts College
-
ఓయూకి వెయ్యి కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు రాజకీయాలకు అతీతంగా చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎవరు పైరవీలు చేసినా సహించబోమని, ఇందులో ప్రభుత్వ జోక్యం కూడా ఉండదని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదేనన్నారు. ఎంతోమంది ఉద్యమకారులను, మేధావులను అందించిన చరిత్ర ఓయూకు ఉందని చెప్పారు. అయితే గడచిన పదేళ్ళుగా వర్సిటీ అభివృద్ధికి దూరంగా ఉందని విమర్శించారు. ఓయూ అభివృద్ధికి బాటలు వేసేందుకే తాను వచ్చానని అన్నారు. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని, అందుకే రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడను ఎలా వదిలించాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. బుధవారం ఓయూను సందర్శించిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రమే..నాలెడ్జ్ కాదు ‘ఏ వ్యక్తికైనా భూమి లేకపోవడాన్ని పేదరికంగా గుర్తిస్తారు. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనమనే అనాలి. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని దూరం చేస్తుంది. అయితే డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. ఆ అవకాశం లేని పేదల కోసం ఓయూలో అధునాతన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆంగ్ల భాష కమ్యూనికేషన్ మాత్రమే.. నాలెడ్జ్ కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని వారు ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడరు. చైనీయులకు ఇంగ్లీష్ భాష రాదు. ఆ దేశం ఉత్పత్తులు నిలిపివేస్తే అమెరికా విలవిల్లాడుతుంది. నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా. గుంటూరులో చదువుకోలేదు. గూడు పుఠాణీలు తెలియవు. నాకు విదేశీ భాష రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవడం వచ్చు. పేదలు, నిస్సహాయులకు సాయం చేయాలనే తపన నాకు ఉంది. అలాగని ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. నాలెడ్జ్, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. చరిత్ర గుర్తుంచుకునేలా పాలన అందించాలన్నదే నా లక్ష్యం..’అని సీఎం వెల్లడించారు. యువత చదువుకుని పైకి రావాలి ‘విద్యార్థులు రాజకీయాల ఉచ్చులో పడకుండా, నిబద్ధతతో చదువుకుని పైకి రావాలి. డాక్టర్లు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు కావాలి. యువత డిగ్రీలు సాధిస్తున్నారు కానీ, నైపుణ్యం ఉండటం లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది. నాకు ఫాం హౌస్ల్లేవ్ చేతనైతే ఓయూ ఆర్ట్స్ కాలేజీకి రమ్మని గతంలో కొంతమంది సవాల్ విసిరారు. కానీ నేను అభిమానంతో ఇక్కడికి వచ్చా. నాకు ఎక్కడా ఫాం హౌస్‌లు లేవు. నేను ప్రజల సొమ్ము దోచుకోలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రెండేళ్ళల్లో ఏం చేశావని నన్ను ప్రశ్నించే నేతలు పదేళ్ళ పాలనలో ఏం చేశారో చెప్పాలి. కుటుంబం మొత్తం వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వాళ్ళు దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామన్న హామీని అమలు చేశారా? మేము రెండేళ్ళ పాలనలో ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాం. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేశాం. ఎస్సీ వర్గీకరణ అమలుతో సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేపట్టాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఏవీఎన్ రెడ్డి, అద్దంకి దయాకర్, హైదరాబాద్ మేయర్ జి. విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కళాశాల విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఓయూ వీసీ కుమార్ మొలుగరం తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నమూనాల ఆవిష్కరణ సభా వేదికపై ఓయూ అభివృద్ధికి సంబంధించిన పలు నమూనాలను సీఎం ఆవిష్కరించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌లో కొత్త అకడమిక్ బ్లాక్, పరిశోధన, అభివృద్ధి బ్లాక్, కొత్త బాలుర, బాలికల హాస్టళ్లు, బహుళార్ధసాధక క్రీడా కేంద్రం, సమీకృత గ్రంథాలయం, కొత్త ఆరోగ్య కేంద్రం, జీవ వైవిధ్య ఉద్యానవనం, కన్వెన్షన్ సెంటర్, సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల నడక మార్గాలతో కూడిన విస్తృత రహదారి నెట్వర్క్ ఉన్నాయి. కాగా ఓయూ అభివృద్ధి పనులకు రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. -
అతడు విద్యార్థి కాదు..కూలీ
ఉస్మానియా ఆర్ట్సు కళాశాల లైబ్రరీ వెనక ఉన్న నీటి ట్యాంకులో యువకుడి మృతదేహం బుధవారం కలకలం రేపింది.బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, అతడు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్- 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలనే డిమాండ్ తోనే చనిపోయాడంటూ ఆరోపించారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. అతడి ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంత మంతా టెన్షన్ వాతావరణం నెల కొంది. మరో వైపు యువకుడి మృత దేహం పూర్తిగా డీ కంపోస్టై ఉండటంతో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓ స్థాయిలో యువకుడి మృత దేహాన్ని గుర్తుపట్టేందుకు వచ్చిన మాణిక్యేశ్వర్ నగర్ వాసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసు విచారణలో అతడు విద్యార్థి కాదు..అడ్డా కూలీ అని, మాణిక్యేశ్వర్‌నగర్ వాసి అయిన ప్రసాద్ కుమారుడు బాబా అని తేలింది. -
బంద్...
- 300 మందికి పైగా అరెస్ట్.. విడుదల - బస్సు సర్వీసులకు ఆటంకం - పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ నగరంలో స్వల్ప ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా ముగిసింది. బంద్ వ ల్ల ఆర్టీసీ ముందస్తుగా 250 బస్సులను రద్దు చేసింది. 500 సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రైలే సర్వీసులు యధావిధిగా నడిచాయి. ఆందోళనకారులు ఉదయం ఏడు గంటలకే రోడ్డు పైకి వచ్చి విద్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోలు బంక్‌లను బలవంతంగా బంద్ చేయించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, జేఎన్టీయూ క్యాంపస్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, చందా నగర్, ఫలక్‌నుమా స్టేషన్, ముసారంబాగ్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, సైదాబాద్, మాదన్నపేట, సరూర్‌నగర్, మల్కజ్గిరి, బాలాపూర్ చౌరస్తాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలనూ దహనం చేశారు. హస్తినాపురం చౌరస్తాలో ఏపీ సీఏం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్ వల్ల మెజంజాహీ మార్కెట్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమయత్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలు బోసిపోయాయి. జంట నగర కమిషనరేట్ల పరిధిలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అట్టుడికిన ఆర్టీసీ క్రాస్ రోడ్డు నిరసనలు, నినాదాలు, దిష్టిబొమ్మల దహనం, బైఠాయింపులు, అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు అట్టుడికింది. కొంత మంది ఆందోళనకారులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను ఆపి, టైర్లలో గాలి తీశారు. అవి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పలువును తెలంగాణ వాదులు చిక్కడపల్లి వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించగా, స్వరాజ్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయగా, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సహా సీపీఎం నాయకుడు వీరయ్య, డీజీ న రసింహారావు, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజిజ్ పాషా, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు విమలక్క, సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్థన్, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పద్మ, సత్య తదితర నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నం తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు ముందస్తుగా తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు. బువ్వ తెలంగాణ కావాలి... తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నిరసన తెలిపారు. ప్రజా కళాకారులు ధూం ధాం ఆటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, ఎన్నికలు, రాజకీయ పార్టీల ద్వారా తెలంగాణ రాలేదని, కేవలం ఉద్యమాలతోనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అలా వచ్చిందని ఎవరైనా భ్రమపడితే భవిష్యత్తే వారికి సరైన సమాధానం ఇస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ కంటే ముందు బువ్వ తెలంగాణ కావాలని కోరారు. గిరిజనులపై దాడి లాంటిదే:? - ప్రొఫెసర్ కోదండరామ్ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అమాయక గిరిజనులపై దాడి చేయడం లాంటిదేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే తాము అనుసరిస్తున్నామని బీజేపీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాలు కొనసాగించేందుకే మీరు అధికారంలోకి వచ్చారా? అని ఘటుగా ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఏకపక్షంగా బిల్లును ఆమోదించే వారు కాదని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించి ఖమ్మంలోని రెండు లక్షల మంది గిరిజనులకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బిల్లు ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ (రాయల వర్గం) కేంద్ర కమిటీ సభ్యుడు పి.సూర్యం మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామికంగా ఆమోదించారని ధ్వజమెత్తారు.సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవర్థన్ మాట్లాడుతూ బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేయడానికే పోలవరం నిర్మిస్తున్నారని ఆరోపించారు. 300 గ్రామాలను ముంచేసి 2 లక్షలకు పైగా గిరిజనుల అస్థిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


