కర్నాటక: సివిల్ కేసులో తీర్పు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో మహిళా న్యాయమూర్తి కుర్చీకి చేతబడి చేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిక్కబళ్లాపురం నగరంలోని వలసణ్ణ వీధికి చెందిన మంజుల అనే మహిళ.. 1వ అదనపు సివిల్ న్యాయమూర్తి కుర్చీపై మంత్రించిన తెల్ల ఆవాలు చల్లింది.
ఈ దృశ్యాలు న్యాయస్థానంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై న్యాయస్థానం ముఖ్య పరిపాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కబళ్లాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు మంజులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆవరణలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


