అర్ధరాత్రి ఊరంతా చేతబడి.. టెన్షన్ వాతావరణం..! | black magic in tribal village | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఊరంతా చేతబడి.. టెన్షన్ వాతావరణం..!

May 1 2026 10:56 AM | Updated on May 1 2026 11:05 AM

black magic in tribal village

అర్ధరాత్రి సమయం… ఊరు అంతా భయంతో నిశ్శబ్దంగా ఉంది… కొంతమంది గ్రామస్తులు ఒక చోట చేరి గుసగుసలు మాట్లాడుతున్నారు… నేలపై అనుమానాస్పదమైన చేతబడి గుర్తులు… చుట్టూ పొగ, చీకటి… టెన్షన్ వాతావరణం!

శ్రీకాకుళం క్రైమ్‌/కొత్తూరు: తరాలు మారుతున్నాయి.. రోజురోజుకీ టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది.. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం వేకువఝామున కొత్తూరు మండలం గొట్టిపల్లి గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో చిల్లంగి నెపంతో సవర ఎల్లంగి, అతని భార్య గయానీలను అదే గ్రామానికి చెందిన వ్యక్తి  హత్య చేసిన సంగతి తెలిసిందే.  

కుమార్తెకు బాగోలేకపోవడంతో.. 
నిందితుడు సవర తోటయ్య కుమార్తె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎల్లంగి చిల్లంగి పెట్టాడన్న అనుమానాన్ని పెంచుకున్నాడు. ఒకానొక సమయంలో పెద్దల వద్ద పంచాయితీ సైతం నడవగా రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆమెకు తగ్గకపోవడం, ఇటీవల తరచూ తోటయ్య కలలోకి ఎల్లంగి రావడంతో తనకు కూడా చిల్లంగి పెట్టి ఉంటాడని తోటయ్య భావించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం వేకువఝాము 4 గంటలకు ఇంటి ముందు సిమెంటు రోడ్డుపై నిద్రిస్తున్న ఎల్లంగిపై తోటయ్య గొడ్డలితో దాడి చేశాడు. పక్కనే ఉన్న ఎల్లంగి భార్య గయానీకి కూడా ఎక్కడ ఆమె బతికితే చిల్లంగి పెడుతుందేమోనని గొడ్డలితో నరికాడు. కొనవూపిరితో ఉందని భావించి సమీపంలో బండరాయి ఎత్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు.  

గ్రామస్తుల గోప్యమేల..?  
వేకువఝామున హత్యలు జరిగినా రాత్రి 8 గంటల వరకు పోలీసులకు తెలియపర్చకుండా గ్రామస్తులు ఎందుకు గోప్యం పాటించారన్నది అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. కొండ ఎగువన గ్రామం ఉండటం, రాత్రి సమయంలో అజ్ఞాత వ్యక్తి సమాచారమివ్వడంతో సీఐ చింతాడ ప్రసాద్, ఎస్‌ఐ వెంకటేష్‌ తమ సిబ్బందితో అతికష్టమ్మీద వెళ్లారు. రాత్రంతా ముద్దాయి కోసం గాలించారు. కాగా హత్యల విషయం గోప్యంగా ఉంచడానికి చనిపోయిన సవర ఎల్లంగి బంధువులు నిందితుడైన కోటయ్యను సైతం చంపేసి ఒకేసారి ముగ్గురి మృతదేహాలను దహనపర్చాలనే ఆలోచన  చేసినట్లు  సమాచారం. పోలీసులకు తెలిస్తే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తారనే కారణంతోనే సమాచారమివ్వలేదని తెలుస్తోంది.   

  • గతంలోనూ హత్యలు..  
    కొత్తూరు మండలం పుల్లగూడలో ఆరేడేళ్ల క్రితం చిల్లంగి నెపంతో కొట్టి ప్రాణముంటుండగానే ఓ గిరిజన వ్యక్తిని కాల్చి చంపేశారు. గ్రామస్తులు కూడా విషయాన్ని ముందుగా బయటకు పొక్కనీయకుండా రాజీ యత్నానికే అప్పట్లో    ప్రయ   తి్నంచారు.  

  • రెండున్నరేళ్ల క్రితం ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావుకు చిల్లంగి ఉందన్న నెపంతో దారి కాచి కొట్టి పురుగుల మందు తాగించి మెడ చుట్టూ తువ్వాలు బిగించి చంపి పడేశారు. తన కుమారుడు చావుకు ఈశ్వరరావు చిల్లంగి పెట్టడమే కారణమని భావించిన బోర ఆదినారాయణ తన సోదరుడు, మరికొందరి సహాయంతో చంపేశాడు.  

  • 2022 ఏడాదిలో గార మండలం బచ్చువానిపేటలో బచ్చు రామయ్యతాతను సొంత అన్న కొడుకే చిల్లంగి నెపంతో అంతమొందించాడు. కుటుంబసభ్యుల సహకారంతో చంపేసి గ్రామ సమీప కొర్లాం పొల్లాల్లో స్క్రూడ్రైవ్‌తో గొంతులో పొడిచి వెదురుకర్రతో తలపై మోది చంపి పడేశారు.  

అనాథలుగా పిల్లలు..  
ఎల్లంగికి ముగ్గురు సంతానం. వారిలో కుమార్తెకు వివాహమవ్వగా పెద్దకుమారుడు పోడు వ్యవసాయం చేసుకుటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. వీరికి ఎటువంటి ఆధారం లేక తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మిగిలారని బంధువులు, గ్రామస్తుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. నిందితుడు సవర తోటయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement