ఆస్తి యాజమాన్య హక్కులను గ్రామ పంచాయతీలు తేల్చలేవు | Gram Panchayats cannot decide property ownership rights says Ap High Court | Sakshi
Sakshi News home page

ఆస్తి యాజమాన్య హక్కులను గ్రామ పంచాయతీలు తేల్చలేవు

Jun 10 2026 4:00 AM | Updated on Jun 10 2026 4:00 AM

Gram Panchayats cannot decide property ownership rights says Ap High Court

గ్రామ పంచాయతీలు సివిల్‌ కోర్టులు కాదు: హైకోర్టు

సాక్షి, అమరావతి: భవన నిర్మాణ అనుమతుల మంజూరు విషయంలో గ్రామ పంచాయతీల అధికారంపై హైకోర్టు ముఖ్యమైన తీర్పును వెలువరించింది. అనుమతుల విషయంలో గ్రామ పంచాయతీలు సివిల్‌ కోర్టులాగా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లీగల్‌ నోటీసులను సాకుగా చూపి భవన నిర్మాణ దరఖాస్తులను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, ఆ అధికారం గ్రామపంచాయతీలకు లేదని తేల్చిచెప్పింది. 

భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసేటప్పుడు స్థానికసంస్థలు కేవలం దరఖాస్తుదారుడి ప్రాథమిక హక్కులను, ఆ ఆస్తి దరఖాస్తుదారుడి స్వాధీనంలో ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలించాలంది. అంతేగానీ సివిల్‌ కోర్టుల్లా యాజమాన్య హక్కులను తేల్చే అధికారం వాటికి లేదని తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి పంపిన లీగల్‌ నోటీసు ఆధారంగా ఓ భవననిర్మాణ అనుమతిని రద్దుచేస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తీర్మానం ఏకపక్షంగా ఉందంటూ దాన్ని రద్దుచేసింది. 

పిటిషనర్‌ జమాల్‌రెడ్డి వద్ద రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్, ఇంటిపన్ను చెల్లించిన రశీదులున్నాయని, ఇవి ఆయనకు ఆ ఆస్తిపై ఉన్న ప్రాథమిక హక్కును నిరూపిస్తున్నాయని తెలిపింది. పిటిషనర్‌ ప్రస్తుతం భవనం నిర్మిస్తున్న చోటే నివాసం ఉన్నారని గుర్తుచేసింది. పిటిషనర్‌ నివాసం, పన్నులు చెల్లించిన విషయంతో పంచాయతీ అధికారులు విభేదించడంలేదని, ఇది అతడి ప్రాథమిక హక్కులను రూఢీ చేస్తోందని పేర్కొంది. 

భవననిర్మాణం కోసం జమాల్‌రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ప్రకారం పునఃపరిశీలించి 15 రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని పంచాయతీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ‘భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించిన పంచాయతీ తీర్మానంపై పిటిషనర్‌కు ప్రభుత్వం వద్ద అప్పీల్‌ చేసుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. అయితే పంచాయతీ నిర్ణయం ఏకపక్షంగా ఉన్నందున ఈ కోర్టే నేరుగా జోక్యం చేసుకుంటోంది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

అనుమతి నిరాకరణపై హైకోర్టులో పిటిషన్‌  
కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన కాంటారెడ్డి జమాల్‌రెడ్డి 2009లో కొన్న స్థలంలో మట్టి ఇల్లు నిర్మించుకుని, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆయన మట్టి ఇంటిని కూల్చేసి భవనం నిర్మించుకోవాలనుకున్నారు. ఆ ఆస్తిపై యాజమాన్య వివాదం ఉందంటూ.. జమాల్‌రెడ్డికి ఆ స్థలం విక్రయించిన వ్యక్తి వారసులు పంచాయతీ కార్యదర్శికి లీగల్‌ నోటీసు పంపారు. ఈ లీగల్‌ నోటీసు ఆధారంగా గ్రామ పంచాయతీ 2025 డిసెంబర్‌ 24న జమాల్‌రెడ్డి ఇంటి నిర్మాణానికి అనుమతిని నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ జమాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.  

అనుమతుల వల్ల కొత్త హక్కులు రావు.. ఉన్నవి పోవు.. 
‘భవననిర్మాణ అనుమతి ఇవ్వడం అనేది ఒక వ్యక్తికి కొత్తగా యాజమాన్య హక్కులను కల్పించదు. అలాగే మరొకరికున్న హక్కులను లాగేసుకోదు. ఒకవేళ ఆస్తిపై ఎవరికైనా నిజమైన అభ్యంతరాలుంటే వారు సివిల్‌ కోర్టును ఆశ్రయించి తేల్చుకోవాలి. అంతేతప్ప పంచాయతీలు సివిల్‌ కోర్టుల పరిధిని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ కేసులో జమాల్‌రెడ్డి స్థలం యాజమాన్యపు హక్కులపై అభ్యంతరం వ్యక్తం చేసినవారు కేవలం లీగల్‌ నోటీసు ఇచ్చారే తప్ప, ఇప్పటివరకు సివిల్‌ కోర్టులో కేసు దాఖలు చేయలేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement