ఆచార్య జి.ఎన్. రెడ్డి
ఇన్ బాక్స్
తెలుగు భాషా సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఆచార్య జి.ఎన్. రెడ్డి. ఆయన చిత్తూరు జిల్లాలోని ‘మహా సముద్రం’లో పుట్టారు. తెలుగు ఆచార్యులకు ఏనాడూ రాని వైస్– ఛాన్స్‌లర్ పదవి ఆయనతో 1984లో మొదలయ్యింది. శ్రీ వేంకటే శ్వర విశ్వ విద్యాలయానికి వైస్–ఛాన్స్లర్‌గా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననలను అందుకొన్నారు.
ఆయన గొప్ప నిఘంటుకారుడు. నిఘంటు నిర్మాణంతో పాటు నామ విజ్ఞానం, భాషా సాహి త్యాలలో అందెవేసిన చేయి. తెలుగు–తెలుగు నిఘంటువులు, ఇంగ్లీష్–తెలుగు ద్విభాషా నిఘంటువు, కుమ్మరం, వడ్రంగం మాండలిక వృత్తి పద కోశాలు, తెలుగు పర్యాయ పద నిఘంటువులు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. మహాభారతం శల్య సౌప్తిక స్త్రీ పర్వాలకు రచించిన పీఠిక, భగవద్గీతకు రాసిన పీఠిక, బ్రౌన్ గ్రంథాలకు రచించిన పీఠికలు ఎంతో విశ్లేషణాత్మకమైనవి.
వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బంగోరె సహకారంతో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా బ్రౌనుకు సంబంధించిన స్వీయ సాహితీ జీవిత చరిత్రల మీద అనేక పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. వాటిలో బ్రౌన్ లేఖలు, బ్రౌన్ కడప జాబులు, ఆంధ్ర గీర్వాణ ఛందము వంటి అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే జి.ఎన్. రెడ్డి భాషా విజ్ఞాన పరిచయం, ద్రావిడ భాషా విజ్ఞా్ఞనం, తన జీవిత చరిత్ర అయిన ‘జి.ఎన్. రెడ్డి జీవితరేఖలు’ కూడా రాశారు. జానపదులు చెప్పుకొనే పొడుపు కథలను సేకరించి ‘పొదుపు కథలు’ అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు.
1962–64 మధ్య అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో లెక్చ రర్‌గా పని చేసి అక్కడి విద్యార్థుల కోసం కూడా వాచకాలను రాశారు. చికాగో యూనివర్సిటీలో కూడా లింగ్విస్టిక్స్ పాఠాలు బోధించారు. కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రావ్‌ు కింద 1974లో బల్గేరియా, 1981లో మలేషియా, 1983లో బ్రిటన్ వంటి ఎన్నో దేశాల్లో పర్యటించారు. బ్రిటన్ గ్రంథాలయంలోని అరుదైన పుస్త కాలను మెక్రో ఫిల్మ్‌ల ద్వారా ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖకు అందించారు. ఆయన విస్కాన్సిన్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు చేకూరి రామా రావు, భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ఉద్దండ భాషావేత్తలతో కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. ప్రసిద్ధ భాషావేత్త గెరాల్డ్ కెల్లీతో కూడా స్నేహం చేశారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన సాహితీ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు.
– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, ఫౌండర్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ (నేడు ఆచార్య జి.ఎన్. రెడ్డి వర్ధంతి)


