న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియతో ఇప్పటికే లక్షలాది మంది తమ పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయా? లేదా? అనే ఆందోళనలో ఉండగా.. ఎన్నికల సంఘం మరో కీలక నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫామ్-6 ఆన్‌లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా తాతమ్మల పేర్లు గత SIR ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? అనే వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. దీంతో "పాత జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు లేకపోతే కొత్త ఓటరు నమోదు ఇబ్బందుల్లో పడుతుందా?" అనే చర్చ మొదలైంది.
ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వాళ్ల కోసం ఎన్నికల సంఘం (EC) కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే.. తమతో పాటు తల్లిదండ్రులు లేదా పూర్వీకుల పేర్లు గత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? అనే వివరాలను ఫామ్-6లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆన్‌లైన్ దరఖాస్తు ముందుకు వెళ్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఫామ్-6లో కొత్త మార్పు
కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు.. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత, గతంలో పేరు తొలగించబడి మళ్లీ నమోదు కోరుకునే వారు ఫామ్-6ను వినియోగిస్తారు. తాజాగా ఈ ఫామ్‌లో కొత్త డిక్లరేషన్‌ను జత చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినప్పటికీ, పరిపాలనా ఆదేశాల ద్వారా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఏ వివరాలు అడుగుతున్నారు?
ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి మూడు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
గత SIR ఓటరు జాబితాలో తన పేరు ఉందా?
తల్లిదండ్రులు లేదా తాతమ్మల పేర్లు గత SIR జాబితాలో ఉందా?
తన పేరు గానీ, కుటుంబ సభ్యుల పేర్లు గానీ గత SIR జాబితాలో లేవా?
మొదటి రెండు ఎంపికల్లో ఏదైనా ఎంచుకుంటే, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్, ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
ఈసీ చెబుతున్న కారణం ఇదే..!
ఈ ప్రక్రియతో కొత్త ఓటర్లను ఇప్పటికే ఉన్న ఓటరు రికార్డులతో అనుసంధానం చేయడం సులభమవుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. అలాగే అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం కూడా తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం తొలిసారిగా గత ఏడాది బిహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సందర్భంగా అమలు చేసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా SIR ప్రక్రియ
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించినవారు, చిరునామా మార్చుకున్నవారు, దీర్ఘకాలంగా గైర్హాజరైనవారు, అనర్హులు లేదా విదేశీయుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో SIR పూర్తికాగా.. తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు.. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
అయితే ఈ సవరణల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించబడటంపై రాజకీయ వర్గాలు, పౌరసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధన భవిష్యత్తులో కొత్త ఓటర్ల నమోదుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది


