‘సర్‌’ డేటా చోరీకి దొంగలొచ్చారు! | Suspicion that voter details are being recorded in the My TDP app | Sakshi
Sakshi News home page

‘సర్‌’ డేటా చోరీకి దొంగలొచ్చారు!

Jul 13 2026 3:29 AM | Updated on Jul 13 2026 3:30 AM

Suspicion that voter details are being recorded in the My TDP app

దర్శిలో టీడీపీ బీఎల్‌ఏలతో కలిసి బీఎల్‌వో వద్దకు వచ్చిన నలుగురు  

అమరావతి నుంచి వచ్చామంటూ ఓటర్ల వివరాల సేకరణ 

వారికి టీడీపీ నాయకుల సహకారం  

ఓటర్ల వివరాలను మై టీడీపీ యాప్‌లో నమోదు చేస్తున్నట్లు అనుమానం 

దర్శి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు సేకరించిన ఓటర్ల డేటాను చోరీ చేసేందుకు కొందరు వ్యక్తులు రంగంలోకి దిగారు. తాము అమరావతి ఆఫీసు నుంచి వచ్చామంటూ బీఎల్‌వోల నుంచి ఓటర్ల వివరాలను పూర్తిగా సేకరిస్తున్నారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ఆదివారం ఉదయమే బీఎల్‌వోలు ఎన్యూమరేషన్‌ ఫారాలను సేకరించడం ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకు పట్టణంలోని 120వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటర్ల నుంచి బీఎల్‌వో ఎన్యూమరేషన్‌ ఫారాలు సేకరిస్తుండగా, టీడీపీ బీఎల్‌ఏలతో కలిసి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు. 

తాము అమరావతి ఆఫీసు నుంచి వచ్చామని చెప్పి బీఎల్‌వో వద్ద ఉన్న ఓటర్ల జాబితాను తీసుకున్నారు. దానిలోని ఓటర్ల కులం, మతం, ఫోన్‌ నంబర్లు, ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల గురించి బీఎల్‌వోను అడిగి తెలుసుకుని ఒక పుస్తకంలో రాసుకున్నారు. కొందరు ఓటర్ల వివరాలను ముందుగానే రాసుకుని వచ్చి వారు ఎక్కడ ఉన్నారనే వివరాలు సేకరించారు. వారిని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు ప్రశ్నించగా... సర్‌ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని తెలుసుకునేందుకు వచ్చామని బదులిచ్చారు. 

అసలు వాళ్లు ఎందుకు వచ్చారని 120వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌ బీఎల్‌వో వెంకటేశ్వర్లును ‘సాక్షి’ అడగగా, టీడీపీ బీఎల్‌ఏలతో వచ్చి ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అనంతరం వారు పక్కన ఉన్న 129వ నంబర్‌ బూత్‌కు వెళ్లి మధ్యాహ్నం తర్వాత వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వాస్తవానికి ఆ నలుగురు సేకరించిన ఓటర్ల వివరాలను మై టీడీపీ యాప్‌లో నమోదు చేసేందుకే వచ్చారని తెలుస్తోంది. టీడీపీ నాయకులు వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేసి కూర్చోబెట్టుకుని వివరాలు తెలియజేయడం ఇందుకు బలాన్నిస్తోంది.  

బీఎల్‌వో, సూపర్‌వైజర్‌పై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించాల్సిందేనని పట్టు 
కురిచేడు: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నమశ్శివాయపురంలోని 81, 82 బూత్‌నంబర్లలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలంటూ టీడీపీ ఎంపీటీసీ సిద్దన నరసింహ సుబ్బారావు ఆదివారం బీఎల్‌వో, సూపర్‌వైజర్‌పై దౌర్జన్యానికి దిగాడు. తాను చెప్పిన వారి ఓట్లు తొలగించాల్సిందేనంటూ వారి పనిని అడ్డుకున్నాడు. అందుకు అంగీకరించని ఆ ఇద్దరు అధికారులు బూత్‌స్థాయి ఏజెంట్లు అభ్యంతరాలు తెలియజేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పగా.. ససేమిరా అంటూ ఎంపీటీసీ సుబ్బారావు వారితో వాగ్వాదానికి దిగాడు. 

గతంలోనూ అదే గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అప్పట్లో వారి పథకం ఫలించలేదు. ఎన్నికల అధికారులు కల్పించుకుని గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement