ఆర్టీసీపై అస్మదీయులకే పెత్తనం
ఇ–బస్సుల విధానంలో అస్మదీయుల కోసం అడ్డగోలు నిబంధన
ధర పెంపుదల హక్కు ప్రైవేటు సంస్థల చేతుల్లోనే
ఆర్టీసీ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఎత్తుగడ
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. ఆర్టీసీ ఆర్థిక మూలాలపై దెబ్బతీసే రీతిలో ఇ–బస్సుల విధానాన్ని ఖరారు చేస్తోంది. ఇ–బస్సుల కాంట్రాక్టు ధర పెంపుదల అధికారం ప్రైవేటు సంస్థల గుప్పెట్లో ఉంచేందుకు సిద్ధపడుతోంది. తద్వారా ఆర్టీసీ ఖజానాపై ప్రైవేటు సంస్థలకే పెత్తనాన్ని కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థలకే ఇ–బస్సుల కాంట్రాక్టు కట్టబెట్టాలన్నది అసలు ఎత్తుగడ. తమ వారికి అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేందుకు తాజా పన్నాగం ఇలా ఉంది.
హక్కు ప్రైవేటు సంస్థలదే...
ఆర్టీసీ నిర్వహిస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టే ఇ–బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థలకు కిలోమీటర్‌కు రూ.74.50 చొప్పున చెల్లించాలని చంద్రబాబు సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందులో కేంద్ర ప్రభుత్వం కి.మీ.కి రూ.24.50 చెల్లిస్తుంది. కి.మీ.కి మిగిలిన రూ.50 చొప్పున ఆర్టీసీయే భరించాలి. ప్రైవేటు సంస్థలకు చెల్లించే ఈ ధరను 6 నెలలకు ఒకసారి పెంపుదల చేసే అవకాశాన్ని కల్పించాలని సర్కారు నిర్ణయించింది.
మరీ విడ్డూరం ఏమిటంటే.. ఆ పెంపుదల హక్కు ప్రైవేటు సంస్థల ఇష్టం. ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. అంటే కి.మీ.కి రూ.74.50 గిట్టుబాటు కావడం లేదని ప్రైవేటు సంస్థలు భావిస్తే.. ప్రభుత్వానికి కేవలం సమాచారం ఇచ్చి ధర పెంచుకోవచ్చు. ఆ విధంగా 6 నెలలకోసారి సమీక్షించి ధర పెంపుదలను ప్రతిపాదించవచ్చు. అంటే ప్రైవేటు సంస్థలకు కిలోమీటరుకు చెల్లించే ధరను ప్రతి 6 నెలలకోసారి పెంచేందుకు ప్రభుత్వం ముందుగానే మార్గం సుగమం చేసింది.
అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వాటాను పెంచదు. పెరిగిన ఆర్థిక భారాన్ని ఆర్టీసీయే భరించాలి. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్న డీజిల్ అద్దె బస్సుల కాంట్రాక్టు విధానంలో ఆ నిబంధన లేదు. టెండరు సమయంలో ఖరారు చేసిన ధరనే కాంట్రాక్టు కాలపరిమితి ఉన్నంత కాలం కొనసాగిస్తున్నారు. కానీ ఇ–బస్సుల విషయంలో మాత్రం 6 నెలలకోసారి ధర పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం.
ఆర్టీసీ ఖజానా గుల్ల.. ప్రైవేటు గల్లా గలగలా
ప్రైవేటు సంస్థలకు అడ్డగోలు ప్రయోజనం కల్పించేందుకే ఈ నిబంధనను పొందుపరుస్తున్నారు. దాంతో ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం మొదటి దశలో 1,450 ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2029 నాటికి దశలవారీగా 10 వేల ఇ–బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే 100 శాతం ఇ–బస్సులే ఉంటాయి. వాటిని ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి.
టీడీపీ మద్యం సిండికేట్ మాదిరిగానే.. టీడీపీ అస్మదీయ సంస్థలతో ఇ–బస్సుల సిండికేట్‌ను అధికారికంగా ఏర్పాటు చేస్తున్నట్టేనని ఆర్టీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ సిండికేట్ ప్రతి 6 నెలలకోసారి కాంట్రాక్టు రేటును పెంచుతూ ఆర్టీసీ ఖజానాకు కొల్లగొట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీసి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం పక్కాగా పావులు కదుపుతోందనే విషయం స్పష్టమవుతోంది.


