నీళ్లు అడిగితే రక్తం కావాలా? | BRS Deputy Floor Leader Harish Rao fires on revanth reddy | Sakshi
Sakshi News home page

నీళ్లు అడిగితే రక్తం కావాలా?

Jul 13 2026 2:54 AM | Updated on Jul 13 2026 2:54 AM

BRS Deputy Floor Leader Harish Rao fires on revanth reddy

రూ. ఏడు వేల కోట్లతో పోలవరాన్ని ముంచిన అధికారులతో మేడిగడ్డపై రిపోర్టులా? 

పట్టిసీమకు నీళ్లు వదిలేసి గురువు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ 

నన్ను జైల్లో వేసినా సరే.. నా ప్రాణం పోయినా సరే.. మోటార్లు ఆన్‌ చేసి రైతులను కాపాడండి 

బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: రైతులు సాగునీరు అడిగితే రక్తం కావాలంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నరహంతకుడికి పెద్దగా తేడా కనిపించడం లేదని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని, బెల్టుతో కొట్టాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత జుగుప్సాకరమని మండిపడ్డారు. 

హిట్లర్‌ను ఆదర్శంగా చెప్పుకునే రేవంత్‌ అదే తరహా హంతక భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈగోతో కన్నెపల్లి, దేవాదుల మోటార్లను నిలిపివేసి రాష్ట్రాన్ని కరువు వైపు నెడుతోందన్నారు. తనను జైల్లో వేసినా, తన ప్రాణం పోయినా అభ్యంతరం లేదని, కానీ వెంటనే మోటార్లు ఆన్‌ చేసి రైతులను ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తడం లేదు 
గోదావరిలో ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తున్నా ప్రభుత్వం కావాలనే నీటిని ఎత్తడం లేదని హరీశ్‌ ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి మోటార్లు నడపొచ్చని, ఇదే విషయాన్ని నిపుణులు, రిటైర్డ్‌ ఇంజనీర్లు, ఇరిగేషన్‌ అధికారులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారని తెలిపారు. కేవలం రూ.8.5 కోట్లతో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి తరలించొచ్చని అధికారులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం బయటపడుతుందనే భయంతోనే మోటార్లు ఆన్‌ చేయడం లేదని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ఇప్పుడు నీటిని ఎత్తకపోతే ఎన్టీపీసీ, సింగరేణి, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు దెబ్బతినడంతోపాటు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డపై నివేదిక ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ అధికారులే పోలవరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల నష్టానికి బాధ్యులని హరీశ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలోనే 

వ్యవసాయ విప్లవం 
కాంగ్రెస్‌ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా, బీఆర్‌ఎస్‌ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు నీరందించామని హరీశ్‌ పేర్కొన్నారు. దేవాదులలో పూర్తిస్థాయిలో మోటార్లు నడపకుండా, గోదావరి జలాలను కిందకు వదిలి పట్టిసీమకు మేలు చేస్తూ సీఎం తన రాజకీయ గురువు చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని, వెంటనే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement