పోలీసుల అదుపులో హంతకుడు? | Rajkumar caught in Kothur Mandal officially not recognized by police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో హంతకుడు?

Jul 13 2026 2:16 AM | Updated on Jul 13 2026 2:16 AM

Rajkumar caught in Kothur Mandal officially not recognized by police

కొత్తూరు మండలం కుమ్మరిగూడలో పట్టుబడ్డ రాజ్‌కుమార్‌!

అధికారికంగా ధ్రువీకరించని పోలీసులు.. సోషల్‌ మీడియాలో వదంతులు నమ్మొద్దని సూచన

నిందితుడు చేగూరు సమీప అటవీ ప్రాంతానికి పరారైనట్లు వెల్లడి 

ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న తొమ్మిది పోలీసు బృందాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా/ షాద్‌నగర్‌/ షాబాద్‌: తనపై పోక్సో కేసుకు కారణమయ్యారంటూ కక్ష పెంచుకొని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన కిల్లర్‌ రాజ్‌కుమార్‌ పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉదయం కొత్తూరు మండలం కుమ్మరిగూడ వద్ద ఎస్‌ఓటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 24 గంటలపాటు సమీప అటవీ ప్రాంతంలో దాక్కున్న రాజ్‌కుమార్‌ ఆదివారం ఉదయం టిఫిన్‌ కోసం రోడ్డుపైకి రాగా ఓ ఎస్‌ఓటీ కానిస్టేబుల్‌ వెనుక నుంచి పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తూరు మండలం కుమ్మరిగూడకు చెందిన సుధాకర్‌ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి అతను మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నిందితుడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. కానీ ఈ విషయాన్ని ఫ్యూచర్‌సిటీ పోలీసులు ధ్రువీకరించడం లేదు. 

నిందితుడు చేగూరు రైల్వేట్రాక్‌ దాటి అడవిలోకి వెళ్లాడని.. 9 బృందాలతో అతడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేసిన తర్వాత రాజ్‌కుమార్‌ షాబాద్‌కు కారులో వెళ్లి అక్కడ కారును వదిలేసి తిమ్మాపూర్‌ రైల్వే స్టేషన్‌లో రైలెక్కి పరారయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రాజ్‌కుమార్‌ వాడిన ఫోన్‌ నంబర్లలో ఒకటి బిహార్‌లో లొకేషన్‌ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి రాజ్‌కుమార్‌ రైల్లో బిహార్‌కు వెళ్లి ఉండొచ్చని అనుమానంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే నిందితుడు ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పిన నేపథ్యంలో షాబాద్, కొత్తూరు, శంషాబాద్, పాల్మాకుల పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల వద్ద గాలించినట్లు తెలిసింది. మరోవైపు నిందితుడి తల్లిదండ్రులు సహా నిందితుడి ఫోన్‌కాల్‌ డేటాను విశ్లేషించిన పోలీసులు.. అతనికి సహకరించిన కొందరు సన్నిహితులను శనివారం విచారించారు. రాజ్‌కుమార్‌ జాడ కోసం షాద్‌నగర్, షాబాద్, నందిగామ, కొత్తూరు, శంషాబాద్‌ పరిసరాలను జల్లెడపట్టారు. 

మా అదుపులో లేడు: డీసీపీ యోగేష్‌ గౌతం 
రాజ్‌కుమార్‌ తమ అదుపులో ఉన్నాడనేది వదంతి మాత్రమేనని... అందులో వాస్తవం లేదని ఫ్యూచర్‌ సిటీ (చేవెళ్ల జోన్‌) డీసీపీ యోగేష్‌ గౌతం స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ‘శుక్రవారం రాత్రి 11:47 గంటలకు దైవాలగూడలోనే నిందితుడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఆ తర్వాత కారు చేగూరు సమీపంలో వదిలి, రైల్వేట్రాక్‌ దాటి రాజ్‌కుమార్‌ అడవిలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాం. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇచ్చి సహకరించాలి’అని డీసీపీ కోరారు. 

నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ 
ప్రేమ పేరుతో బాలికను వేధించి చివరకు ఆ కుటుంబాన్ని హతమార్చిన నిందితుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్లముందే చెల్లి, తల్లి, నానమ్మను పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిన దివ్యాంగురాలు మేఘనను ఆదివారం ఆయన పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు.  

ఆరు హత్యలు.. ఏడురాళ్లు 
నిందితుడు రాజ్‌కుమార్‌.. దైవాలగూడలో బాలికను హత్య చేసిన చోట ఏడు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. భార్య, ఇద్దరు పిల్లలు సహా బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు ఏడాది క్రితం మరణించిన బాలిక తండ్రిని కూడా తానే అంతమొందించినట్లు సంకేతం ఇచ్చేందుకే ఏడు రాళ్లను పేర్చి ఉంటాడన్న వాదన వినిపిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బెయిల్‌ డీల్‌ రూ. 25 లక్షలు? 
పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌కు ముందస్తు బెయిల్‌ లభించేలా పోలీసులు, అధికార పార్టీ నేతలు సహకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సహా చేవెళ్లకు చెందిన మరో అధికార పార్టీ నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా నిందితుడు రాజ్‌కుమార్‌ సదరు పోలీసులకు రూ. 25 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్‌ లభించాక రాజ్‌కుమార్‌ పోలీసు స్టేషన్‌ సిబ్బందితో కలిసి మద్యం సేవించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వ్యవహారంపై ఎస్‌ఐ రమేష్‌పై సస్పెన్షన్‌ వేటు వేసిన సీపీ..సీఐ కాంతారెడ్డికి నోటీ సులు జారీ చేశారు. మరికొందరు పోలీసు సిబ్బందిపైనా చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement