కొత్త ఓటర్ల నమోదు ఇక కఠినం! | Sir 2026 draft includes strict rules for registering new voters | Sakshi
Sakshi News home page

కొత్త ఓటర్ల నమోదు ఇక కఠినం!

Jul 13 2026 2:50 AM | Updated on Jul 13 2026 2:50 AM

Sir 2026 draft includes strict rules for registering new voters

గత సర్‌ జాబితాలో తమ/బంధువుల పేర్లు ఉండాల్సిందే 

ఓటరు/ బంధువు పేరు, నియోజకవర్గం, పార్ట్, సీరియల్‌ నంబర్లు ఇవ్వాలి 

ఈ మేరకు ఫారం–6తో పాటు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి 

సర్‌ 2026 ముసాయిదాలో కొత్త ఓటర్ల నమోదుకు కఠిన నిబంధనలు 

సర్‌ 2026 ముగిశాక సైతం కొనసాగించే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితాలో పేరు లేదా? కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ పేరైనా లేదా మీ బంధువుల పేర్లయినా చివరిసారిగా నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్‌)లో తప్పనిసరిగా ఉండాల్సిందే. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6 దరఖాస్తుతోపాటుగా సమర్పించాల్సిన స్వీయ ధ్రువీకరణ ఫార్మాట్‌లో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్పులు చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మూడో విడత సర్, 2026లో భాగంగా త్వరలో ప్రచురించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు కోసం ప్రస్తుతం ఎక్కడా ఓటరుగా లేని వ్యక్తులు ఫారం–6 దరఖాస్తుతో పాటు ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో కొత్త ఓటర్ల నమోదు నిబంధనలు మరింత కఠినమయ్యాయి. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో సర్‌ నిర్వహించగా, మళ్లీ ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సర్‌లో కొత్త ఓటరుగా నమోదు కోసం ఫారం–6 దరఖాస్తుతోపాటు స్వీయధ్రువీకరణలో తమ లేదా తమ కుటుంబ సభ్యుల ‘సర్‌–2002’ఓటు వివరాలను సమర్పించాలి.  

డిక్లరేషన్‌ ఫారమ్‌లో ఏముంటుంది?  
దరఖాస్తుదారులు ఈ డిక్లరేషన్‌ ఫారంలో పేరు, తల్లిదండ్రుల వివరాలు, గత ‘సర్‌’ఓటర్ల జాబితాలో తమ పేరు/తమ బంధువుల (తల్లి/తండ్రి) పేరు ఉన్నట్లయితే, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్‌ కేంద్రం(పార్ట్‌) నంబర్, సీరియల్‌ నంబర్‌ను రాయాలి. ఒకవేళ ఈ వివరాలు లేని పక్షంలో, ఆ విషయాన్ని ఫారంలో స్పష్టంగా పేర్కొనాలి. ఆన్‌లైన్‌ (https://voters.eci.gov.in/) లో ఓటరుగా నమోదు కోసం ఫారం–6 నింపుతున్నప్పుడు, పైన పేర్కొన్న స్వీయ ధ్రువీకరణను పూర్తి చేయకపోతే దరఖాస్తు ప్రక్రియ ముందుకు కదలదు. 

దరఖాస్తుదారుడు తన సంతకంతో స్వీయ ధ్రువీకరణ సమర్పిస్తేనే ఫారం–6ను పరిగణనలోకి తీసుకుంటారు. లేకుంటే దరఖాస్తు బుట్టదాఖలే. ఇక డిక్లరేషన్‌ ఫారంలో దరఖాస్తుదారులు అందించే వివరాలను బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌ఓ) గత సర్‌ డేటాబేస్‌తో సరిచూస్తారు. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే లేదా అందుబాటులో లేకపోతే, అటువంటి దరఖాస్తుదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు దరఖాస్తుదారులు తమ నివాస, వయసు ధ్రువీకరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాలను (జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, ఆధార్, విద్యా సంబంధిత సర్టిఫికెట్లు) సమర్పించాల్సి ఉంటుంది. 

సర్‌ తర్వాత కూడా తప్పనిసరి? 
ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్‌–2026 కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినా, సర్‌ ముగిసిన తర్వాత భవిష్యత్తులో సమర్పించే కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులకీ తప్పనిసరి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సర్‌–2002 లేదా సర్‌–2026 ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా బంధువుల పేర్లు కలిగి ఉన్న వ్యక్తులే భవిష్యత్తులో కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఫారం–6తోపాటు గత ‘సర్‌’వివరాలను స్వీయ ధ్రువీకరణ రూపంలో సమర్పించాల్సి రావచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement