లీక్‌ అయితే పరీక్షార్థికి పరిహారం | Education Minister Dharmendra Pradhan resignation over NEET paper leak | Sakshi
Sakshi News home page

లీక్‌ అయితే పరీక్షార్థికి పరిహారం

Jun 12 2026 4:47 AM | Updated on Jun 12 2026 4:47 AM

Education Minister Dharmendra Pradhan resignation over NEET paper leak

కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్‌  

ఎగ్జామ్‌ మేనిఫెస్టోను విడుదలచేసిన పార్టీ

పుణె: ప్రతిష్టాత్మక నీట్‌ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, సీబీఎస్‌ఈ ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌లో వైఫల్యాలు, క్యూట్‌ పరీక్ష నిర్వహణలో అసమర్థత వంటి పలు దారుణోదంతాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) గురువారం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి దఫాలో పుణెలో తొలి నిరసన కార్యక్రమాన్ని గురువారం మొదలెట్టింది. 

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సారథ్యంలో పుణెలోని సావిత్రీభాయ్‌ ఫూలే పుణె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పార్టీ అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేపీ తమ ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదలచేసింది. మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే జూన్‌ 20వ తేదీన పుణె విద్యార్థులంతా ఢిల్లీకొచ్చి ఉద్యమిస్తారని దీప్కే స్పష్టంచేశారు. హిందూ–ముస్లిం విభజన అంశాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. 

వీటి నుంచి దృష్టి మరలిస్తేనే స్తంభించిన దేశ ప్రగతి రథాలు ముందుకు కదులుతాయని దీప్కే అన్నారు. ‘‘హిందూ–ముస్లిం విభజన రాజకీయాలతో యువత విసిగెత్తిపోయారనేందుకు మా కాక్రోచ్‌ నిదర్శనం. ఇలాంటి రాజకీయాలతో సమాజం కంపుకొడుతోంది. ఈ కంపు పోగొట్టేందుకే బొద్దింకలొచ్చాయి. ప్రభుత్వంతో చర్చలకు మేం సిద్ధం. మాతో చర్చలకు ముందుకురాకుండా ప్రభుత్వం మా సోషల్‌మీడియా ఖాతాలను స్తంభింపజేయడంలో బిజీగా మారింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. 

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... 
→ ఇకమీదట ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు, ఉద్యోగ సంబంధ పరీక్షల్లో ఒక ప్రశ్నపత్రం లీక్‌ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి/విద్యార్థికి రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి 
→ లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా, సమయానికి పరీక్షాకేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలి 
→ పరీక్ష రద్దయితే ఆ రద్దయిన పేపర్‌ మాత్రమే 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా ‘షెడ్యూల్‌ చేసిన తేదీ’లను ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీల్లో పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి 
→ ఆన్‌లైన్‌లో పేపర్‌లను దిద్దడం మానేసి సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌లు స్వయంగా పేపర్‌లను దిద్దాలి.  
→ రాసిన పరీక్ష రద్దయి తర్వాత పరీక్ష రాసేలోపు వయోపరిమితి దాటిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి 
→ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానాలను ఆడిటింగ్‌ చేయాలి 
→ పరీక్షలను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడో సంస్థకు ఇస్తే వాళ్ల గత చరిత్రను క్షుణ్ణంగా తనిఖీచేయాలి  

 

Advertisement
 
Advertisement
Advertisement