breaking news
CUET
-
CUET UG 2026: టాపర్‌గా ఢిల్లీ మాజీ మంత్రి కుమార్తె!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిన ఈ ఫలితాల్లో ఢిల్లీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గహ్లాట్ కుమార్తె దేవీనా గహ్లాట్ అద్భుత ప్రతిభ కనబరిచారు. 1,250 మార్కులకు గానూ 1,232.19 మార్కులు సాధించి, ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ (AIR 1) సొంతం చేసుకున్నారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఆమె సాధించిన ఈ విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.మార్కుల సునామీ.. నాలుగు సబ్జెక్టుల్లో రికార్డుదేవీనా గహ్లాట్ ఈ పరీక్షలో మొత్తం ఐదు సబ్జెక్టులకు హాజరై, అత్యుత్తమ స్కోరు సాధించారు. ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టులలో ఆమె ఏకంగా 100 పర్సంటైల్ సాధించగా.. ఇంగ్లీష్ సబ్జెక్టులో 99.99 పర్సంటైల్, ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్‌లో 99.91 పర్సంటైల్ దక్కించుకున్నారు. సైకాలజీలో పూర్తి స్థాయిలో 250 మార్కులు సాధించిన దేవీనా, ఇంగ్లీష్‌లో 241.95, ఎకనామిక్స్‌లో 249.53, పొలిటికల్ సైన్స్‌లో 249.58 మార్కులతో మొత్తం 1232.19 మార్కులు సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచారు.‘ఇది నా తల్లిదండ్రుల కల’ఢిల్లీ వసంత కుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)విద్యార్థిని అయిన దేవీనాకు చిన్నప్పటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. గతంలో ఆమె తన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కూడా 99.2 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచారు. ఈ అద్భుత విజయంపై దేవీనా స్పందిస్తూ, ‘ఈ ఫలితం చూడగానే నాకు మొదట మా తల్లిదండ్రులే గుర్తుకొచ్చారు. కష్టకాలంలో వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ విజయం నా కుటుంబానికే దక్కుతుంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత చదువులు చదవడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించారు.హోరాహోరీ పోటీ.. ముగిసిన నిరీక్షణఈ ఏడాది CUET UG పరీక్షలు ముగిసిన కేవలం 16 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి ఎన్టీఏ రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే 12 రోజులు ముందుగానే ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 15.68 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఈ రేసులో సక్షమ్ గోయల్ 1230.82 మార్కులతో రెండో స్థానాన్ని, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఉదిత్ చతుర్వేది 1207.21 మార్కులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి రెండు ర్యాంకుల మధ్య ఉన్న స్వల్ప తేడా ఈ ఏడాది పోటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: బాబా వంగా జోస్యం: వరల్డ్ కప్‌లో గ్రహాంతరవాసుల దాడి? -
లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం
పుణె: ప్రతిష్టాత్మక నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్‌లో వైఫల్యాలు, క్యూట్ పరీక్ష నిర్వహణలో అసమర్థత వంటి పలు దారుణోదంతాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి దఫాలో పుణెలో తొలి నిరసన కార్యక్రమాన్ని గురువారం మొదలెట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సారథ్యంలో పుణెలోని సావిత్రీభాయ్ ఫూలే పుణె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పార్టీ అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేపీ తమ ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదలచేసింది. మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే జూన్ 20వ తేదీన పుణె విద్యార్థులంతా ఢిల్లీకొచ్చి ఉద్యమిస్తారని దీప్కే స్పష్టంచేశారు. హిందూ–ముస్లిం విభజన అంశాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. వీటి నుంచి దృష్టి మరలిస్తేనే స్తంభించిన దేశ ప్రగతి రథాలు ముందుకు కదులుతాయని దీప్కే అన్నారు. ‘‘హిందూ–ముస్లిం విభజన రాజకీయాలతో యువత విసిగెత్తిపోయారనేందుకు మా కాక్రోచ్ నిదర్శనం. ఇలాంటి రాజకీయాలతో సమాజం కంపుకొడుతోంది. ఈ కంపు పోగొట్టేందుకే బొద్దింకలొచ్చాయి. ప్రభుత్వంతో చర్చలకు మేం సిద్ధం. మాతో చర్చలకు ముందుకురాకుండా ప్రభుత్వం మా సోషల్‌మీడియా ఖాతాలను స్తంభింపజేయడంలో బిజీగా మారింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... → ఇకమీదట ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు, ఉద్యోగ సంబంధ పరీక్షల్లో ఒక ప్రశ్నపత్రం లీక్ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి/విద్యార్థికి రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి → లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా, సమయానికి పరీక్షాకేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలి → పరీక్ష రద్దయితే ఆ రద్దయిన పేపర్ మాత్రమే 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా ‘షెడ్యూల్ చేసిన తేదీ’లను ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీల్లో పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి → ఆన్లైన్లో పేపర్లను దిద్దడం మానేసి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు స్వయంగా పేపర్లను దిద్దాలి. → రాసిన పరీక్ష రద్దయి తర్వాత పరీక్ష రాసేలోపు వయోపరిమితి దాటిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి → కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాలను ఆడిటింగ్ చేయాలి → పరీక్షలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడో సంస్థకు ఇస్తే వాళ్ల గత చరిత్రను క్షుణ్ణంగా తనిఖీచేయాలి -
మరో వివాదంలో ఎన్టీఏ.. దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’ పరీక్ష నిర్వహణ వైఫల్యంతో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఇప్పుడు మరో సమస్య చుట్టుముట్టింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్ ఐఏటీ) ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ ఒకే రోజున అంటే జూన్ 7వ తేదీనే నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జాతీయ స్థాయి పరీక్షలు ఒకే రోజు ఉండటంతో, తాము దేనిని ఎంచుకోవాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.పరీక్షల తేదీల క్లాష్‌తో సందిగ్ధంలో విద్యార్థులుదేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే, జూన్ 7న ఈ రెండు పరీక్షలు ఒకే సమయంలో జరగడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే పరీక్షల వాయిదాలతో ఒత్తిడికి గురైన విద్యార్థులకు, ఈ తేదీల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాలకు వెళ్లడం అసాధ్యమని, దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.ఎన్టీఏ తక్షణ స్పందనఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. పరీక్షా షెడ్యూల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థి వివరాలను వెంటనే cuet-ug@nta.ac.in ఈమెయిల్ ద్వారా పంపాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులకు తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.మొదలైన విమర్శలు, ఆందోళనలుఇప్పటికే సీయూఈటీ-యూజీ పరీక్షా నిర్వహణలో సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు తాజాగా చోటుచేసుకున్న ఈ తేదీల వివాదంతో ఎన్టీఏ తీరుపై మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ముందుగానే సమన్వయం చేసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఏ ఈ పరీక్షల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందోనని విద్యార్థులు వేచి చూస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎబోలా విలయం: రెండు రోజుల్లో రెండింతలైన కేసులు -
ఇప్పుడు క్యూట్ వంతు
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్– యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ, సీబీఎస్ఈ పునర్మూల్యాంకనంలో లోపాలు, పరీక్షఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలో పరువు పోగొట్టుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్(క్యూట్–యూజీ) పరీక్ష రాసేందుకు శనివారం సిద్ధమైన వేలాది మంది విద్యార్థులు అవస్థలుపడ్డారు. సాంకేతిక సమస్యతో పరీక్ష రాయలేక చివరకు వెనుతిరిగారు. మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటలకు పరీక్షహాల్లోకి అనుమతించారు. మూడు గంటలకు పరీక్ష మొదలుకావాల్సి ఉండగా గంటపాటు అభ్యర్థులు లాగిన్కాలేకపోయారు. 4 గంటలకు పరీక్ష మొదలుపెట్టారు. సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా 3,765 మంది అభ్యర్థులు పరీక్షరాయలేక చివరకు వెనుతిరిగారు. ఉదయం సెషన్లోనూ ఇలాంటి సమస్య తలెత్తగా ఆలస్యంగా పరీక్ష మొదలైంది. వాళ్లకు మాత్రం కోల్పోయిన కాలం మేరకు అదనపు సమయాన్ని కేటాయించారు. మ«ధ్యాహ్నం సెషన్లో మాత్రం వేలాది మంది పరీక్షరాయలేకపోయారని వాళ్లకు మాత్రం వేరేరోజు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్టీఏ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూట్–యూజీ పరీక్షకు టెక్నికల్ సరీ్వస్ ప్రొవైడర్‌గా ఉన్న ‘టీసీఎస్ ఐఆన్’సంస్థ నుంచి వివరణ కోరామని ఎన్టీఏ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించింది. అభ్యర్థుల్లో పరీక్షపై ఏమైనా సందేహాలు ఉంటే +91–11–40759000 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి లేదా cuet-ug@nta. ac.in ఈమెయిల్ ఐడీకి మెయిల్‌చేసి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చని ఎన్టీఏ స్పష్టంచేసింది. సాంకేతిక సమస్య కారణంగా ఉదయం సెషన్ రెండు గంటలు ఆలస్యంగా చేపట్టామని టీఎస్ఎస్ సంస్థ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు.వెల్లువెత్తిన విమర్శలు పరీక్ష కోసం లోపలికి వెళ్లిన అభ్యర్థులు ఎంతకీ బయటకురాకపోవడంతో మండుటెండలో వేచిచూసిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘‘మూడు, నాలుగు గంటలు బయట ఎండలో వేచిచూసి అలసిపోయాం. తీరా బయటికొచ్చి పరీక్ష రాయలేదు అని వాళ్లు చెప్పడంతో ఒళ్లు మండింది. జాతీయస్థాయి పరీక్షలను ఇలాగేనా నిర్వహించేది? వాళ్లు లోపల పరీక్ష రాయట్లేదనే విషయం బయట ఉన్న మాలో ఒక్కరికీ చెప్పలేదు’’అని ఒక పరీక్షార్థి తల్లి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘సుదూరం నుంచి ఉదయం ఆరు గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చాం. తీరాచూస్తే 11 గంటలకైనా ఎగ్జామ్ మొదలెట్టలేదు. మా వాళ్లు ఎదురుచూసి అలసిపోయి వెనుతిరిగారు’’ అని మరో నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా అసహనం వ్యక్తంచేశారు.ఇది ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ: కాంగ్రెస్ క్యూట్–యూజీ ఉదయం సెషన్ ఆలస్యం, వేలాది మంది మధ్యాహ్నం పరీక్ష రాయలేకపోవడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్టీఏ వైఫల్యాలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యుడిని చేయకుండా ఆయనను ప్రధాని మోదీ వెనకేసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజా క్యూట్–యూజీ ఘటనను ‘ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ’గా అభివరి్ణంచింది.‘విశ్వగురువు’ ఒక్క పరీక్షా సవ్యంగా నిర్వహించట్లేరు: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలోని సంస్థ క్యూట్–యూజీ పరీక్ష సవ్యంగా నిర్వహించలేకపోవడంతో లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ విశ్వగురువే. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మాత్రం అది సాధ్యపడట్లేదు. కనీసం ఒక్క పరీక్షను సవ్యంగా, సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. మొన్న నీట్, నిన్న సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, నేడు క్యూట్’’ అంటూ విమర్శించారు. -
యూజీసీ కంటే అడుగు ముందే ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అమల్లోకి తెచ్చింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతోపాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. అలాగే వర్సిటీలకు కూడా ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ భారమూ ఉండదని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు సీయూఈటీలో చేరాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే గతేడాది ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీపీజీసెట్–2021ను నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్ర వర్సిటీలు యూజీసీ నిర్వహించాలనుకుంటున్న సీయూఈటీలో చేరలేదు. రాష్ట్రం నుంచి సీయూఈటీకి కేవలం 1,080 దరఖాస్తులు మాత్రమే అందాయి. అవి కూడా రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ వర్సిటీ (అనంతపురం)తో పాటు ఇతర సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాల కోసం దాఖలైనవే. ఒక అడుగు ముందే ఏపీ.. రాష్ట్రంలో 15 సంప్రదాయ వర్సిటీలు ఉండగా వాటిలో పోస్ట్రుగాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆయా వర్సిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఆయా వర్సిటీల్లో చేరాలనుకునే విద్యార్థులు పలు ప్రవేశపరీక్షలు రాయాల్సి వచ్చేది. దీనివల్ల వేర్వేరుగా ఫీజులను చెల్లించడంతోపాటు పరీక్షలకు హాజరవడానికి వ్యయప్రయాసలు తప్పేవి కావు. ఇక ఆయా వర్సిటీల్లో ప్రవేశాలు ఒకే తేదీల్లో ఉంటే ఏదో ఒకదానికే హాజరు కావలసి వచ్చేది. ఈ దుస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహించేలా గతేడాదే చర్యలు చేపట్టాయి. యూజీసీ ఇప్పుడు చేస్తున్న ఆలోచనలను ఏడాది ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఏపీపీజీసెట్ విషయంలోనే కాకుండా విద్యారంగ పురోగతికి చేపట్టే వివిధ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్.. ఇతర రాష్ట్రాలు, వ్యవస్థలకంటే అడుగు ముందే ఉంది. నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న అనేక సంస్కరణలు అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల ఏర్పాటు, కరిక్యులమ్ సంస్కరణలు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇలా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉన్నత విద్యలో చేరికలు పెంచేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన ఖర్చులను సైతం అందిస్తోంది. ఒక్క పీజీసెట్‌తో 15 వర్సిటీల్లో ప్రవేశం ఏపీపీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా 15 వర్సిటీల్లో చేరడానికి విద్యార్థులకు అవకాశం దక్కింది. దీనివల్ల ఫీజుల భారం తగ్గడంతోపాటు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవస్థ తప్పింది. గతేడాది ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలను యోగి వేమన వర్సిటీ చేపట్టింది. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళా, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, కర్నూలు క్లస్టర్ వర్సిటీలతోపాటు జేఎన్టీయూ అనంతపూర్– ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (జేఎన్టీయూఏ–ఓటీపీఆర్‌ఐ)లలోని సీట్లను ఏపీపీజీసెట్ ద్వారా భర్తీ చేశారు. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్‌సెట్ (రీసెర్చ్సెట్)ను కూడా ఇంతకుముందే అమల్లోకి తెచ్చింది. ఈ సెట్లో మెరిట్ సాధించినవారికి మాత్రమే ఆయా వర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టుల వల్ల ఆయా సామాజికవర్గాలకు రిజర్వేషన్లపరంగా అందాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కుతున్నాయి. -
సెంట్రల్ వర్సిటీల ఎంట్రన్స్‌లో ఇంటర్ వెయిటేజి రద్దు
సాక్షి, అమరావతి: కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులకు ఎలాంటి వెయిటేజి ఉండదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. కొన్ని సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)పై యూజీసీ ఇటీవల పబ్లిక్ నోటీసు విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. సీయూఈటీ పరిధిలోకి ఈసారి 45 సెంట్రల్ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని వర్సిటీలు ఇంటర్ మార్కులను కూడా వెయిటేజిగా తీసుకొంటున్నాయి. ఇకపై ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉండదని, ఆయా వర్సిటీలు ఇంటర్మీడియట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ పేర్కొంది. ప్రవేశాలు పూర్తిగా సీయూఈటీలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయని స్పష్టంచేసింది. అయితే, యూనివర్సిటీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ అర్హత మార్కులను ఏ మేరకు తీసుకోవాలో ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్ణయించిన అర్హత మార్కులు పొందిన విద్యార్థులకు మాత్రమే సీయూఈటీలో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటం, కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులకు మేలు చేసేలా ఎక్కువ మార్కులు వేస్తుండడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని యూజీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకూ సీయూఈటీతో ప్రవేశాలకు అవకాశం 2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 13 భాషల్లో నిర్వహిస్తుంది. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీని అనుసరించి ప్రవేశాలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొంది. సీయూఈటీ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్‌లో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచుతారు. పూర్తి నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేస్తుంది. సీయూఈటీలో మార్కుల ప్రాతిపదికగా ఎన్టీఏ మెరిట్ జాబితా విడుదల చేస్తుంది. వర్సిటీలు తమ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూనే సీయూఈటీ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తాయని యూజీసీ ప్రకటించింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల ఆధారంగా సీయూఈటీకి బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులుంటాయి. తప్పుడు సమాధానాలకు మార్కుల్లో కోత పడుతుంది. -
యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్‌ను వినియోగించుకోవచ్చన్నారు. సీయూఈటీతో ప్రయోజనాలు అధిక కట్-ఆఫ్‌ల ఒత్తిడి నుంచి విద్యార్థులకు సీయూఈటీతో ఉపశమనం కలగనుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆమేరకు వ్యయప్రయాసలు తప్పుతాయి. అయితే సీయూఈటీపై విద్యావేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్ష ఎలా ఉంటుంది? సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్ మల్టిఫుల్ చాయిస్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్ నుంచి అకౌంట్స్ లేదా బిజినెస్.. హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. (క్లిక్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల) రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు. విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మినహాయింపు విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు. సీయూఈటీ స్కోర్ వాడుకోవచ్చు 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సులు చదవాలంటే సీయూఈటీ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడే సంస్థలు.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోర్లను ఉపయోగించుకోవచ్చు.


