CUET UG 2026: టాపర్‌గా ఢిల్లీ మాజీ మంత్రి కుమార్తె! | CUET UG 2026 Results, Delhi MLA Kailash Gahlot’s Daughter Devina Gahlot Secures AIR 1 With Outstanding Score | Sakshi
Sakshi News home page

CUET UG 2026: టాపర్‌గా ఢిల్లీ మాజీ మంత్రి కుమార్తె!

Jun 24 2026 10:46 AM | Updated on Jun 24 2026 12:09 PM

Devina Gahlot Tops CUET UG 2026 BJP MLAs Daughter Bags AIR 1

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన ఈ ఫలితాల్లో ఢిల్లీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గహ్లాట్ కుమార్తె దేవీనా గహ్లాట్ అద్భుత ప్రతిభ కనబరిచారు.  1,250 మార్కులకు గానూ 1,232.19 మార్కులు సాధించి, ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ (AIR 1) సొంతం చేసుకున్నారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఆమె సాధించిన ఈ విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మార్కుల సునామీ.. నాలుగు సబ్జెక్టుల్లో రికార్డు
దేవీనా గహ్లాట్ ఈ పరీక్షలో మొత్తం ఐదు సబ్జెక్టులకు హాజరై, అత్యుత్తమ స్కోరు సాధించారు. ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టులలో ఆమె ఏకంగా 100 పర్సంటైల్ సాధించగా.. ఇంగ్లీష్‌ సబ్జెక్టులో 99.99 పర్సంటైల్, ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్‌లో 99.91 పర్సంటైల్ దక్కించుకున్నారు. సైకాలజీలో పూర్తి స్థాయిలో 250 మార్కులు సాధించిన దేవీనా, ఇంగ్లీష్‌లో 241.95, ఎకనామిక్స్‌లో 249.53, పొలిటికల్ సైన్స్‌లో 249.58 మార్కులతో మొత్తం 1232.19 మార్కులు సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచారు.

‘ఇది నా తల్లిదండ్రుల కల’
ఢిల్లీ వసంత కుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్‌)విద్యార్థిని అయిన దేవీనాకు చిన్నప్పటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. గతంలో ఆమె తన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కూడా 99.2 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచారు. ఈ అద్భుత విజయంపై దేవీనా స్పందిస్తూ, ‘ఈ ఫలితం చూడగానే నాకు మొదట మా తల్లిదండ్రులే గుర్తుకొచ్చారు. కష్టకాలంలో వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ విజయం నా కుటుంబానికే దక్కుతుంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత చదువులు చదవడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించారు.

హోరాహోరీ పోటీ.. ముగిసిన నిరీక్షణ
ఈ ఏడాది CUET UG పరీక్షలు ముగిసిన కేవలం 16 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి ఎన్‌టీఏ రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే 12 రోజులు ముందుగానే ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 15.68 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఈ రేసులో సక్షమ్ గోయల్ 1230.82 మార్కులతో రెండో స్థానాన్ని, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఉదిత్ చతుర్వేది 1207.21 మార్కులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి రెండు ర్యాంకుల మధ్య ఉన్న స్వల్ప తేడా ఈ ఏడాది పోటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

ఇది కూడా చదవండి: బాబా వంగా జోస్యం: వరల్డ్ కప్‌లో గ్రహాంతరవాసుల దాడి?
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement