సాంకేతిక కారణాలతో పరీక్ష రాయలేకపోయిన 3,700 మందికిపైగా అభ్యర్థులు
మరో పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిన ఎన్‌టీఏ
పరీక్ష రాయలేకపోయిన వారి కోసం విడిగా ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటన
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్– యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ, సీబీఎస్‌ఈ పునర్‌మూల్యాంకనంలో లోపాలు, పరీక్షఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలో పరువు పోగొట్టుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్(క్యూట్–యూజీ) పరీక్ష రాసేందుకు శనివారం సిద్ధమైన వేలాది మంది విద్యార్థులు అవస్థలుపడ్డారు.
సాంకేతిక సమస్యతో పరీక్ష రాయలేక చివరకు వెనుతిరిగారు. మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు పరీక్షహాల్‌లోకి అనుమతించారు. మూడు గంటలకు పరీక్ష మొదలుకావాల్సి ఉండగా గంటపాటు అభ్యర్థులు లాగిన్‌కాలేకపోయారు. 4 గంటలకు పరీక్ష మొదలుపెట్టారు. సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా 3,765 మంది అభ్యర్థులు పరీక్షరాయలేక చివరకు వెనుతిరిగారు. ఉదయం సెషన్‌లోనూ ఇలాంటి సమస్య తలెత్తగా ఆలస్యంగా పరీక్ష మొదలైంది.
వాళ్లకు మాత్రం కోల్పోయిన కాలం మేరకు అదనపు సమయాన్ని కేటాయించారు. మ«ధ్యాహ్నం సెషన్‌లో మాత్రం వేలాది మంది పరీక్షరాయలేకపోయారని వాళ్లకు మాత్రం వేరేరోజు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్‌టీఏ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూట్–యూజీ పరీక్షకు టెక్నికల్ సరీ్వస్ ప్రొవైడర్‌గా ఉన్న ‘టీసీఎస్ ఐఆన్’సంస్థ నుంచి వివరణ కోరామని ఎన్‌టీఏ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించింది. అభ్యర్థుల్లో పరీక్షపై ఏమైనా సందేహాలు ఉంటే +91–11–40759000 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి లేదా cuet-ug@nta. ac.in ఈమెయిల్ ఐడీకి మెయిల్‌చేసి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. సాంకేతిక సమస్య కారణంగా ఉదయం సెషన్ రెండు గంటలు ఆలస్యంగా చేపట్టామని టీఎస్‌ఎస్ సంస్థ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు.
వెల్లువెత్తిన విమర్శలు
పరీక్ష కోసం లోపలికి వెళ్లిన అభ్యర్థులు ఎంతకీ బయటకురాకపోవడంతో మండుటెండలో వేచిచూసిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘‘మూడు, నాలుగు గంటలు బయట ఎండలో వేచిచూసి అలసిపోయాం. తీరా బయటికొచ్చి పరీక్ష రాయలేదు అని వాళ్లు చెప్పడంతో ఒళ్లు మండింది. జాతీయస్థాయి పరీక్షలను ఇలాగేనా నిర్వహించేది? వాళ్లు లోపల పరీక్ష రాయట్లేదనే విషయం బయట ఉన్న మాలో ఒక్కరికీ చెప్పలేదు’’అని ఒక పరీక్షార్థి తల్లి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘సుదూరం నుంచి ఉదయం ఆరు గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చాం. తీరాచూస్తే 11 గంటలకైనా ఎగ్జామ్ మొదలెట్టలేదు. మా వాళ్లు ఎదురుచూసి అలసిపోయి వెనుతిరిగారు’’ అని మరో నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా అసహనం వ్యక్తంచేశారు.
ఇది ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ: కాంగ్రెస్ క్యూట్–యూజీ ఉదయం సెషన్ ఆలస్యం, వేలాది మంది మధ్యాహ్నం పరీక్ష రాయలేకపోవడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్‌టీఏ వైఫల్యాలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యుడిని చేయకుండా ఆయనను ప్రధాని మోదీ వెనకేసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజా క్యూట్–యూజీ ఘటనను ‘ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ’గా అభివరి్ణంచింది.
‘విశ్వగురువు’ ఒక్క పరీక్షా సవ్యంగా నిర్వహించట్లేరు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలోని సంస్థ క్యూట్–యూజీ పరీక్ష సవ్యంగా నిర్వహించలేకపోవడంతో లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ విశ్వగురువే. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మాత్రం అది సాధ్యపడట్లేదు. కనీసం ఒక్క పరీక్షను సవ్యంగా, సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. మొన్న నీట్, నిన్న సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ, నేడు క్యూట్’’ అంటూ విమర్శించారు.


