breaking news
third language
-
తొమ్మిదో తరగతిలో మూడో భాష సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ కరిక్యులమ్‌లో భాగంగా తొమ్మిదో తరగతిలో కొత్తగా మూడో భాషను ప్రవేశపెట్టడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీని కారణంగా బోర్డు పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులపై అనవసర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులకు మూడో భాషను నేర్పించాలనుకుంటే ఐదు లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలను (జేఎన్వీ) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఆరో తరగతిలోనే నేర్పించండి... విచారణ సందర్భంగా సీబీఎస్ఈ మూడో భాషా విధానంపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. మూడో భాషగా హిందీనే ఉండాలని విధానాల్లో ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. రాష్ట్ర భాష, ఇంగ్లిష్తో పాటు ఏదైనా మూడో భాషను నేర్పించవచ్చని పేర్కొన్నారు. ‘మీకు హిందీ ఇష్టం లేదు.. పోనీ సంస్కృతం అయితే ఇబ్బంది ఏమిటి?’అని తమిళనాడును ప్రశ్నించారు. మూడో భాష 9వ తరగతి నుంచి తప్పనిసరి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా.. జస్టిస్ నాగరత్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఇబ్బందికరం. 9వ తరగతి విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. కొత్త భాషను 9వ తరగతిలో ఎందుకు ప్రవేశపెడతారు? 6వ తరగతిలోనే ప్రారంభించండి’అని వ్యాఖ్యానించారు. టెన్త్ బోర్డు పరీక్షల ఒత్తిడి 8వ తరగతి చివరి నుంచే మొదలవుతుందని ఆమె గుర్తు చేశారు. తన బాల్యంలో హైసూ్కల్‌కు రాకముందే మూడో భాష నేర్చుకున్న అనుభవాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. కోర్టు అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేయాలని కేంద్రం తరఫున హాజరైన న్యాయవాదికి సూచించారు. రాష్ట్రంలో 38 మోడల్ స్కూళ్లు దేశవ్యాప్తంగా 666 జిల్లాల్లో 689 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసినట్లు కేంద్రం అఫిడవిట్లో తెలిపింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే తమిళనాడులో ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదని స్పష్టం చేసింది. జేఎన్వీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడంతో పాటు తాత్కాలిక వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని వివరించింది. అయితే, జేఎన్వీ నిబంధనలు తమ చట్టబద్ధమైన ద్విభాషా (తమిళం, ఇంగ్లిష్) విధానానికి విరుద్ధమని తమిళనాడు వాదించింది. జేఎన్వీల లక్ష్యాలను తమ సొంత విద్యా వ్యవస్థ ద్వారానే సాధిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున 38 మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం వివరించింది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.50 కోట్లు వెచ్చించామని, వాటి నిర్వహణ కోసం ఏటా రూ.210 కోట్లు వెచ్చిస్తున్నామంది. 2024–25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలల నుంచి 1,340 మంది విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారంది. కొత్తగా జేఎన్వీలను ఏర్పాటు చేసే బదులు, తమ మోడల్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్ర విధానాలకు అనుగుణంగా జేఎన్వీ నిబంధనలను సవరించాలని సూచించింది. నిధుల విడుదల ప్రస్తావన సమగ్ర శిక్షా పథకం కింద నిధుల విడుదల అంశాన్ని సైతం తమిళనాడు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు గాను కేంద్రం వాటా కింద రూ.3,998.82 కోట్లు ఆమోదించగా, కేవలం రూ.450.60 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపింది. ఇంకా రూ.3,548.22 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, నిధుల జాప్యం వల్ల విద్యా కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రానివి అన్న కారణంతో అడ్డుకోవద్దు కేంద్ర ప్రభుత్వానివి అన్న ఒకే ఒక్క కారణంతో పథకాలను తిరస్కరించొద్దని తమిళనాడు ప్రభుత్వానికి జస్టిస్ నాగరత్న హితవు పలికారు. ‘మీకు సొంత విద్యా వ్యవస్థ ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలను అడ్డుకోవద్దు. కేంద్రం ఏర్పాటు చేస్తోందన్న కారణంతో వ్యతిరేకించే ధోరణిని విడనాడాలి’అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే స్థానంలో టీవీకే అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొత్త ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి విధానాన్ని అవలంభిస్తుందో చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు. నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రం, రాష్ట్రం మధ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని ధర్మాసనం పేర్కొంది. సూచనలు తీసుకునేందుకు రాష్ట్రం ఆరు వారాల గడువు కోరడంతో తదుపరి విచారణను ఆగస్ట్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
సీబీఎస్ఈ: మూడో భాష ఫెయిలైతే టెన్త్ సర్టిఫికెట్ రాదు!
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020లో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాషను పాఠశాల స్థాయి అంతర్గత మూల్యాంకన (ఇంటర్నల్ అసెస్మెంట్) తప్పనిసరి సబ్జెక్టుగా మారుస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష బోర్డు ద్వారా కాకుండా పాఠశాల స్థాయిలోనే జరుగుతుందని, అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. ఇందులో పాస్ కాని విద్యార్థులకు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికెట్ లభించదు.ఈ నూతన త్రిభాషా సూత్రం ప్రకారం, విద్యార్థులు కచ్చితంగా రెండు భారతీయ భాషలను, ఒక పరభాషను (నాన్-నేటివ్ ల్యాంగ్వేజ్) చదవాల్సి ఉంటుంది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలోకి, 2027-28లో 10వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ 10వ తరగతిలో విద్యార్థి అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణుడు కాకపోతే, బోర్డు ఫలితాల విడుదలకు ముందే పాఠశాలలు తిరిగి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసినప్పటికీ, తదుపరి ఏడాదిలోగా ఆ పెండింగ్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
కేవీల్లో జర్మన్ స్థానంలో సంస్కృతం
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలల్లో తృతీయ భాషగా జర్మన్ స్థానంలో ఇకపై సంస్కృతాన్ని బోధించనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. జాతీయ అవసరాల దృష్ట్యా కేవీల గవర్నర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఇది సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్నది కాదని, విద్యార్థుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించినదని అన్నారు. కేవీల్లో తృతీయ భాషగా జర్మన్‌ను బోధించడంపై 2011లో కుదిరిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. జాతీయ విద్యావిధానంలో ‘త్రి భాషా పద్ధతి’కి వ్యతిరేకంగా ఉన్న ఆ ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారని కేవీ బోర్డు సమావేశంలో ప్రశ్నించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ఉన్న దాదాపు 68 వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది.


