వావ్‌ ‘సార్థక్‌’.. నాడు సీబీఎస్‌ఈ.. నేడు టెండర్ల స్కామ్! | 17-Year-Old Ranchi Student Exposes CBSECOEMPT Tender Mess, Launches Data Portal | Sakshi
Sakshi News home page

వావ్‌ ‘సార్థక్‌’.. నాడు సీబీఎస్‌ఈ.. నేడు టెండర్ల స్కామ్!

Jun 28 2026 11:24 AM | Updated on Jun 28 2026 11:30 AM

17-Year-Old Ranchi Student Exposes CBSECOEMPT Tender Mess, Launches Data Portal

రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 17 ఏళ్ల టెక్నాలజీ పరిశోధకుడు, సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ మరో సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఇటీవలే సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని లోపాలను ఎండగట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (సీపీపీ) పోర్టల్ నుండి దాదాపు 1.66 కోట్ల ప్రభుత్వ కొనుగోలు రికార్డులను సేకరించి, వాటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ, ఒక బహిరంగ డేటా పోర్టల్‌ను ప్రారంభించాడు. పారదర్శకత అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే తాను ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు సార్థక్ ప్రకటించడం  సంచలనం సృష్టిస్తోంది.

మార్కుల పోరాటం.. స్కామ్ గుట్టురట్టు
సార్థక్ సిద్ధాంత్ ఇటీవల సీబీఎస్‌ఈ క్లాస్ 12 పరీక్షలు రాశారు. అయితే ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో, రీవాల్యుయేషన్ కోసం తన స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలను కోరారు. ఈ ప్రక్రియను లోతుగా పరిశీలిస్తున్న సమయంలో, పరీక్షల మూల్యాంకనానికి ఉపయోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానంలో, దానికి అనుబంధంగా ఉన్న ‘కోఎమ్ట్’ అనే సంస్థ టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆయన గుర్తించారు. గత రెండు వారాలుగా రేయింబవళ్లు శ్రమించి సేకరించిన ఈ కీలక డేటాను sarthaksiddhant.com అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ రికార్డులను పౌరులు, జర్నలిస్టులు, పరిశోధకులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని విశ్లేషించవచ్చని సార్థక్ పిలుపునిచ్చారు.

రంగంలోకి రాహుల్ గాంధీ
ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జూన్ 2వ తేదీన సార్థక్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన 8 నిమిషాల 15 సెకన్ల వీడియోను జూన్ 7న ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. సీబీఎస్‌ఈ, కోఎమ్ట్ సంస్థల మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని ఈ యువకుడు బట్టబయలు చేశాడని రాహుల్ ప్రశంసించారు. నేటి యువత కేవలం రీల్స్ చేస్తూ, పకోడీలు వేపుకుంటూ కూర్చోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని, కానీ ప్రశ్నించే తత్వమున్న ఈ యువత స్వయంగా నిజాలను వెలికితీసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

వివాదాస్పద 'కోఎమ్ట్' నేపథ్యం
ఈ వివాదంలో చిక్కుకున్న కోఎమ్ట్ ఎడ్యుటెక్  సంస్థకు తెలంగాణతో  సంబంధం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బోర్డు పరీక్షల డిజిటల్ మూల్యాంకన పనులను నిర్వహిస్తోంది. గతంలో 2019లో ఈ సంస్థ ‘గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఉండేది. ఆ ఏడాది తెలంగాణ  ఇంటర్‌ బోర్డు పరీక్షల డేటా ప్రాసెసింగ్‌లో జరిగిన లోపాల వల్ల పరీక్ష రాసిన 9.74 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 3 లక్షల మందికి పైగా ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ఈ సంస్థపై తీవ్రస్థాయిలో అవకతవకల ఆరోపణలు వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement