ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బోణీ కొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నార్త్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఫస్ట్ డౌన్ బ్యాటర్ సుజల్ సింగ్(50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నార్త్ ఢిల్లీ బౌలర్లలో మయాంక్ దాగర్ రెండు, వికాస్ దీక్షిత్, వైభవ్ తలా వికెట్ సాధించారు.
సార్థక్ విధ్వంసం
అనంతరం 172 పరుగుల లక్ష్య చేధనలో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ కెప్టెన్, స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా సిమర్‌జీత్ సింగ్‌కు సార్థక్ చుక్కలు చూపించాడు.
అతడు వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో సార్థక్ వరుసగా 4 సిక్సర్లు, ఒక ఫోర్ బాది, చివరి బంతికి సింగిల్ తీశాడు. ఆ ఓవర్‌లో అతడు ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సార్థక్ రంజన్.. 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 95 పరుగులు చేశాడు.
అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నార్త్ ఢిల్లీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కేవలం 16 ఓవర్లలోనే ఊదిపడేసింది. కాగా సార్థక్ రంజన్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడిని రూ.30 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్-2026లో సీజన్ మొత్తం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.
చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్?


