పోలీసులపై హైకోర్టు మండిపాటు
పోలీసులను తక్షణమే నిలువరించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మండిపడింది. అసలు మీరెందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని నిలదీసింది. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా తక్షణమే నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖపట్నంలో ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం(పీఎల్‌సీఎఫ్) పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్న వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు వేధిస్తున్నారంటూ పిటిషన్లు
ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో విశాఖపోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంతోపాటు నిత్యం తమను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని సినీ నిర్మాత నట్టికుమార్ గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వ్యాపారి మంచుకొండ రామకృష్ణ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ విచారణ జరిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వివాదాలను ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం ద్వారా పరిష్కరించుకోవాలంటూ విశాఖ పోలీసులు తమను నిత్యం వేధిస్తున్నారని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
వీరి వాదనలు విన్న న్యాయమూర్తి ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో విశాఖ పోలీసులు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఫోరం పరిధి, దాని చట్టబద్ధత, అధికారాలు, పరిమితులపై సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫోరం సంగతి ఏంటో తేల్చేందుకు కేసు రికార్డులు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ కేసు రికార్డులను సీజే ముందుంచారు. వాటిని పరిశీలించిన సీజే, దీనిని రిట్ పిటిషన్‌గా మలచాలని ఆదేశించి గురువారం విచారణ జరిపారు.
అసలు పోలీసులు ఎందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని గట్టిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం గురించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, ఇందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.


