ఉద్యోగ భద్రత లేదు.. సకాలంలో వేతనాలూ లేవు | RWS Contract Workers Union Meets YS Jagan in Tadepalli Over Unpaid Wages | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత లేదు.. సకాలంలో వేతనాలూ లేవు

Jul 24 2026 5:07 AM | Updated on Jul 24 2026 5:07 AM

RWS Contract Workers Union Meets YS Jagan in Tadepalli Over Unpaid Wages

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మీకులు

వైఎస్‌ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల యూనియన్‌ ప్రతినిధులు 

థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి 

కార్మీకులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాలకు తాగు నీరు అందించడంలో కీలకంగా పని చేస్తున్న త­మకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు లభించడం లేదని గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మీ­కులు వాపోయారు. గురువారం కార్మీక సంఘం ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు. 26 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల మంది కార్మీకులు సమగ్ర మంచి నీటి పథకాలలో పని చేస్తున్నారని తెలిపారు. థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను తగ్గించి ఇస్తున్నారని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కార్మీకుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు. నెలల తరబడి జీతాలు అందక పోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ను కోరారు.

కార్మీకులకు నిర్ణిత రేట్ల ప్రకారం వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్‌ ప్రతినిధులు వివరించిన సమస్యలను సావధానంగా విన్న జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మీకుల న్యాయమైన డిమాండ్ల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచి్చ, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్, దేవినేని అవినాష్ , మల్లాది విష్ణు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement