అమ్మా.. క్షమించు.. | ANM commits suicide by hanging himself in the Secretariat | Sakshi
Sakshi News home page

అమ్మా.. క్షమించు..

Jul 24 2026 5:06 AM | Updated on Jul 24 2026 5:06 AM

ANM commits suicide by hanging himself in the Secretariat

సచివాలయంలో ఉరివేసుకుని ఏఎన్‌ఎం ఆత్మహత్య 

నెల్లూరు జిల్లాలో ఘటన  

చిల్లకూరు: ‘అమ్మా..నన్ను క్షమించు.మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌ నోట్‌లో రాసి సచివాలయంలో పనిచేసే ఏఎన్‌ఎం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాలలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన శ్రీపతి రమణయ్య ద్వితీయ కుమార్తె సాయి చందనప్రియ (27) ఏడాది క్రితం తొణుకుమాల సచివాలయానికి ఏఎన్‌ఎంగా బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి ఆమె స్థానికంగా పనిచేసే వారితో పాటు చింతవరం వైద్యులతో కలిసి సచివాలయంలోనే మధ్యాహ్నం భోజనం చేసేది. 

గురువారం తాను మరోసారి భోజనం చేస్తానని ఆశ వర్కర్లకు చెప్పి వారిని గ్రామంలోని పాఠశాలకు పంపేసింది. సచివాలయ సిబ్బంది మండల పరిషత్‌లోని సమావేశంలో ఉండగా..అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో సూసైడ్‌ నోట్‌ను రాసి టేబుల్‌పై పెట్టి..సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సచివాలయానికి వచ్చిన వారు గమనించి కిందికి దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. 

పోలీసులు వచ్చి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని విషయాన్ని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అక్కడికి వచి్చన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ బాబు తెలిపారు.  

రైలు కింద పడి తహసీల్దార్‌ ఆత్మహత్య 
ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడంతో తీవ్ర మానసిక వేదన  
చిత్తూరు సిద్ధంపల్లె రైల్వే గేటు వద్ద ఆత్మహత్య   
మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ విభాగం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు (45) చిత్తూరు పట్టణ సమీపంలోని సిద్ధంపల్లె రైల్వేగేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కాట్పాడి – తిరుపతి ప్యాసింజర్‌ రైలు కింద పడి ఆయన మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించి.. మదనపల్లె అధికారులకు సమాచారం అందించారు. 

రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్‌ శ్రీనివాసులును ఇటీవల ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయ్యాక ఆయనను మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ విభాగానికి బదిలీ చేశారు. అయితే, సస్పెన్షన్‌ వేటుతో శ్రీనివాసులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చిత్తూరుకు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement