స్థిరాస్తి వ్యాపారం మందగించడంతో దిక్కులేక | - | Sakshi
Sakshi News home page

స్థిరాస్తి వ్యాపారం మందగించడంతో దిక్కులేక

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

సర్కారీ కొలువు.. ఇది ఎంతో మంది ఆశ. దీన్ని ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో అహర్నిశలూ పాటుపడుతుంటారు. అయితే వీరిలో ఉద్యోగం లభించేది అతి కొద్ది మందికే. అలా దక్కించుకున్న కొందరు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. రోజులకే పరిమితం కాకుండా ఏకంగా ఏళ్ల తరబడి డ్యూటీలకు గైర్హాజరవు తూ.. ఇతర వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. జాబ్‌ పేరు చెప్పుకొని రియల్‌ ఎస్టేట్‌.. ఇతర వ్యాపారాలను కొందరు చేస్తుండగా, మరికొందరు మద్యం మత్తులో ఉంటూ ఇలా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా సంవత్సరాల తర్వాత వచ్చి తమను కొలువుల్లోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి నెలకొనడం విస్మయానికి గురిచేస్తోంది.

పలుకుబడి ఉన్న కొందరు ఉద్యోగులు బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పొలాలను కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. మద్యానికి బానిసలైన కొందరు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఎక్కడో తలదాచుకుంటున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రియల్‌ రంగం కుదేలవడంతో పలువురికి ఉద్యోగమనే విషయం ఉన్నట్లుండి గుర్తొచ్చింది. దీంతో అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టకపోతే ఇదే దారిలో మరికొందరు నడిచే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీరిపై ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరుకుంటోంది. ఏళ్ల తరబడి విధుల నుంచి అదృశ్యమై.. వ్యవస్థకే సవాల్‌ విసురుతున్నారు. ఆపై తీరిగ్గా వచ్చి.. వివిధ కారణాలను చూపి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని విధుల్లోకి చేరుతున్నారు. అప్పటికై నా నిబద్ధతతో పనిచేస్తారానంటే అదీ లేదనే చెప్పొచ్చు. తమ పాత పంథానే కొనసాగిస్తూ, మరోసారి అదే బాట పడుతున్నారు.

ఎంత వెనుకేద్దాం..!

ప్రస్తుతం సర్కార్‌ కొలువులను సాధించడమే గగనంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లను విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. అయితే ఉద్యోగాలు చేస్తున్న వారు తమ విధులను గాలికొదిలి.. ఎంత సంపాదిద్దామాననే దిశగా ఆలోచిస్తున్నారు. విధులకు రాకుండా స్నేహితులతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి కొందరు భారీగా సంపాదిస్తున్నారు. రెండు లగ్జరీ కార్లు.. నాలుగు భవంతులను నిర్మించి ఇక తమకు తిరుగులేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అధికారుల అవసరాలను తీరుస్తూ తమ పనిని యథేచ్ఛగా కానిచ్చేస్తున్నారు.

దాదాపు అన్ని శాఖల్లోనూ ఇంతే..

రెవెన్యూ, విద్య, వైద్యారోగ్య తదితర శాఖల్లో ఇదే తంతు నడుస్తోంది. ఒక్క రెవెన్యూలోనే సుమారు 60 మందికిపైగా వీఆర్వోలు, 15 మంది జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు తమ విధులకు ఏళ్లుగా హాజరుకావడంలేదు. నెల్లూరు రూరల్‌ మండలంలో వీఆర్వోలుగా పనిచేసిన ఇద్దరు దాదాపు ఆరేళ్లుగా తమ ఉద్యోగంవైపు కన్నెత్తి చూడటంలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇలా సాగిస్తున్నారు. తీరా తన పరిస్థితి బాగొలేదని.. ఈ కారణంతో విధులకు హాజరుకాలేకపోయానని మభ్యపెడుతూ.. కొలువొచ్చేలా చూడాలని కోరుతూ కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

నిబంధనలకు తూట్లు

వాస్తవానికి ప్రభుత్వోద్యోగులు ఒక్కరోజు సెలవుపై వెళ్లాలన్నా, సంబంధిత అధికారి అనుమతిని విధిగా పొందాలి. లీవ్‌ లెటర్‌పై ఆఫీసర్లు సంతకం చేశాకే సెలవు తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియేమీ లేకుండానే ఉద్యోగులు ఏళ్ల తరబడి కార్యాలయ ముఖం చూడటంలేదు. మరోవైపు రూల్స్‌ మేరకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరైతే సర్వీస్‌ నుంచి పూర్తిగా తొలగించాలి. అయితే ఇలాంటివేవీ జిల్లాలో అమలు కావడంలేదు. పరిస్థితులను పరిశీలించి తిరిగి విధుల్లోకి తీసుకుంటుండటంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అనే చందంగా వ్యవహారం మారింది.

పత్తా లేకుండా పోతున్న

ప్రభుత్వోద్యోగులు

ఏళ్ల తరబడి విధులకు రారు

ఆ తర్వాత కొలువు ఇవ్వాలని వేడుకోలు

ఇదే కోవలో 60 మందికిపైగా వీఆర్వోలు

జిల్లాలో ఇదీ దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement