● గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
● డీసీపల్లి వేలం కేంద్రంలో నిరవధిక
ఆందోళన ప్రారంభం
మర్రిపాడు: పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద నిరవధిక నిరసనను ఆంధ్రప్రదేశ్ రైతు, పొగాకు బోర్డు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రస్తుత ధరలతో కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కనీస గిట్టుబాటు ధరగా కిలోకు రూ.350ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేలంలో అమలవుతున్న నోబిడ్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు రూ.రెండు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. తిరస్కరించిన బేళ్ల కొనుగోలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు రైతుల ప్రయోజనాల పరిరక్షణలో టొబాకో బోర్డు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మర్రిపాడు కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, చండ్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


