నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ), పరికరాలకు రూ.25 కోట్లను ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. మూడంతస్తుల భవన పనులు కొన్ని నెలల క్రితమే పూర్తయ్యాయి. అయితే అందులో ఆపరేషన్ థియేటర్‌కు సంబంధించిన పరికరాలు, యంత్రాలు, మంచాలు, ర్యాకులు, కుర్చీలు, ఇతర పరికరాలను ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ రెండు లారీల్లో వచ్చాయి. వీటిని నూతన క్రిటికల్ కేర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుతో పాటు గైనకాలజీ విభాగాన్ని వచ్చే నెల్లో ప్రారంభించనున్నారు.
ఎస్సీ బాలుర హాస్టల్
వార్డెన్‌పై విచారణ
వింజమూరు(ఉదయగిరి): స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహ వార్డెన్ భాస్కర్‌రావుపై ఆరోపణలొచ్చిన నేపథ్యంలో విచారణను ఐటీటీఏ పీఓ శ్రీనివాసరావు గురువారం జరిపారు. విద్యార్థులు, వార్డెన్‌ను వేర్వేరుగా విచారించి లిఖితపూర్వకంగా వివరాలను తీసుకున్నారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వార్డెన్ వ్యవహరించిన తీరుపై విద్యార్థులు తెలియజేసిన పలు అంశాలను పరిశీలించారు. కొన్ని లోపాలను గుర్తించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని వెల్లడించారు. ఉదయగిరి ఏఎస్‌డబ్ల్యూఓ గీతాదేవి పాల్గొన్నారు.
గురుకులంలో
డీసీఓ తనిఖీలు
వాకాడు: స్థానిక బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాన్ని తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ ప్రభావతమ్మ గురువారం తనిఖీ చేశారు. విద్యతో పాటు మౌలిక వసతులపై ఆరాతీశారు. కోట నుంచి అదనంగా వచ్చిన 207 మంది విద్యార్థులతో పాఠశాలలో కనీస సౌకర్యాల్లేకపోవడంతో వారి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై స్పందించారు. వసతులను త్వరలోనే కల్పించనున్నామని తెలిపారు. సరిపడా బాత్రూమ్‌లు, కొన్ని గదుల్లో ఫ్యాన్ల కొరత ఉందని, అదనపు గదులను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
చికెన్ వ్యర్థాల లారీ పట్టివేత
బుచ్చిరెడ్డిపాళెం: చేపల చెరువుల్లో ఆహారంగా వినియోగించేందుకు భారీ మొత్తంలో తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు.. చికెన్ వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపి లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో జొన్నవాడ వద్ద తనిఖీలను ఎస్సై ఉమాశంకర్, సిబ్బందితో గురువారం రాత్రి నిర్వహించారు. ఓ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 68 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థా లుండటాన్ని కనుగొన్నారు. లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓ ద్విచక్రవాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


