పల్లె వీక్షణతో సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పల్లె వీక్షణతో సమస్యలకు సత్వర పరిష్కారం

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

వెంకటాచలం: గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. వెంకటాచలంలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం నిర్వహించారు. తొలుత వడ్డిపాళెంలో చేపడుతున్న వీబీజీ – రాంజీ ఉపాధి హామీ పనులను పరిశీలించి.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి.. చిన్నారులతో ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను పర్యవేక్షించారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో వైద్య సేవలు, మౌలిక వసతులను తనిఖీ చేశారు. గతేడాది సంభవించిన తుఫాన్లతో దెబ్బతిన్న వీరన్న కనుపూరు చెరువులో రూ.47 లక్షలతో చేపట్టిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పశుసంవర్థక శాఖ నిర్వహించిన కృత్రిమ గర్భధారణ ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

నిర్ణీత గడువులోపు పరిష్కారం

పల్లె వీక్షణలో అందిన ప్రతి అర్జీనీ ప్రత్యేక పోర్టల్లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కరించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను సీఎస్సార్‌ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని.. పీడియాట్రీషియన్‌, జనరల్‌ వైద్యుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టనున్నామని ప్రకటించారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement