breaking news
Chandana priya
-
అమ్మా.. క్షమించు..
చిల్లకూరు: ‘అమ్మా..నన్ను క్షమించు.మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్లో రాసి సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాలలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన శ్రీపతి రమణయ్య ద్వితీయ కుమార్తె సాయి చందనప్రియ (27) ఏడాది క్రితం తొణుకుమాల సచివాలయానికి ఏఎన్ఎంగా బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి ఆమె స్థానికంగా పనిచేసే వారితో పాటు చింతవరం వైద్యులతో కలిసి సచివాలయంలోనే మధ్యాహ్నం భోజనం చేసేది. గురువారం తాను మరోసారి భోజనం చేస్తానని ఆశ వర్కర్లకు చెప్పి వారిని గ్రామంలోని పాఠశాలకు పంపేసింది. సచివాలయ సిబ్బంది మండల పరిషత్‌లోని సమావేశంలో ఉండగా..అగ్రికల్చర్ అసిస్టెంట్ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో సూసైడ్ నోట్‌ను రాసి టేబుల్‌పై పెట్టి..సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సచివాలయానికి వచ్చిన వారు గమనించి కిందికి దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకొని విషయాన్ని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అక్కడికి వచి్చన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. రైలు కింద పడి తహసీల్దార్ ఆత్మహత్య ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో తీవ్ర మానసిక వేదన చిత్తూరు సిద్ధంపల్లె రైల్వే గేటు వద్ద ఆత్మహత్య మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు (45) చిత్తూరు పట్టణ సమీపంలోని సిద్ధంపల్లె రైల్వేగేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కాట్పాడి – తిరుపతి ప్యాసింజర్ రైలు కింద పడి ఆయన మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించి.. మదనపల్లె అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాసులును ఇటీవల ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక ఆయనను మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ విభాగానికి బదిలీ చేశారు. అయితే, సస్పెన్షన్ వేటుతో శ్రీనివాసులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చిత్తూరుకు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
చందన హత్య కేసులో నిందితుల అరెస్టు
మతాంతర వివాహం చేసుకున్న చందనప్రియను హతమార్చిన కేసులో నిందితులు రామ్‌నగర్‌కు చెందిన షేక్ ఇస్సామ్, షేక్ నిస్సార్ ఉద్దీన్ అలియాస్ నిస్సార్ అహ్మద్ అలియాస్ దినా, షేక్ ఉస్సేన్ పీరాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక పిడిబాకు, రక్తము తుడిచిన గుడ్డలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురం శివారులోని బుక్కరాయసముద్రం గ్రామంలోని మహ్మద్ దవానుగుట్ట వద్ద అరెస్టు చేసినట్లు టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ రెడ్డప్ప వెల్లడించారు. చందనను పాశవికంగా హత్య చేసిన ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో మృతురాలి చిన్నాన్న సుధాకర్ ఫిర్యాదు మేరకు అనంతపురం డీఎస్పీ నాగరాజ, జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు నగర టూ టౌన్ పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగారు. సీఐ, ఎస్ఐ తెలిపిన మేరకు.. ప్రేమ వివాహం చేసుకున్న చందనప్రియ, ఇషాక్ స్థానిక రామ్‌నగర్ ఈ-సేవా రోడ్డులో శ్రీజ్ఞాన సరస్వతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. ఆమెను వివాహం చేసుకున్నప్పటి నుంచి భర్త తన చెల్లెలను, తమ్ముడిని, ఇతర బంధువులను సక్రమంగా చూడడం లేదు. వారి పెళ్లయినప్పటి నుంచి ఆమె మరిది షేక్ నిస్సార్‌కు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు చందన తన మరిదికి భోజనం కానీ, టిఫిన్ కానీ పెట్టేది కాదు. చీటికీమాటికి సూటిపోటి మాటలు అనేదని, దీంతో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మరిది ఆమెపై ఈర్ష, ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటల సమయంలో వదిన చందనతో షేక్ నిస్సార్ అహ్మద్ గొడవ పడి, ఆమెను కత్తితో ఎడమవైపు మెడకు, చెవి కింద బలంగా పొడిచి చంపి పారిపోయాడు. అనంతరం హతురాలి ఇద్దరు కూతుళ్లను తన అక్క ఇంటిలో వదిలడంతో ఆమె అనుమానంతో చందన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అతను వెంటనే ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే భార్య చందన చనిపోయి ఉంది. వెంటనే తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అందరూ చర్చించుకుని నిస్సార్‌ను కాపాడేందుకు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న హతురాలి రక్తాన్ని దుప్పట్లతో శుభ్రం చేసి, వాటిని రవి పెట్రోలు బంకు వద్ద మురికి కాలువలో పడేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా అశోక్‌నగర్‌లోని మరానీ కబరస్తాన్‌లో పూడ్చి వేశారు. కాగా ఈ కేసును త్వరగా ఛేదించి నిందితులిన అరెస్ట్ చేసిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. చందన మృతదేహానికి పోస్టుమార్టం.. చందనప్రియ మృతదేహానికి స్థానిక అశోక్ నగర్ శ్మశాన వాటికలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. టూ టౌన్ సీఐ మన్సూరుద్దీన్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమక్షంలో డాక్టర్ శంకర్ పోస్టుమార్టం చేశారు. గొంతుకు పక్క భాగాన, ఎడమ కంటికి కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి నివేదిక మూడు వారాల అనంతరం వెల్లడిస్తామని వారు తెలిపారు. -
వదినను హతమార్చిన మరిది
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ప్రేమించిన వాడే సర్వస్వమనుకుని కన్నవారికి దూరమైన ఓ యువతి పెళ్లైన నాలుగేళ్లకే అత్తింటి వారి కర్కశత్వానికి బలైపోయింది. ఆమె మృతి సాధారణమేనంటూ కుటుంబ సభ్యులు బంధువులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఈ నెల 13న ‘వివాహిత దారుణ హత్య’ పేరుతో ‘సాక్షి’ అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురంలోని రామ్‌నగర్‌లో నివాసముంటున్న ఇషాక్ చికెన్ కబాబ్ బండి నిర్వహించేవాడు. 2009లో పెద్దలను ఎదిరించి కమలానగర్‌కు చెందిన చందన (24)ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అవమానంగా భావించిన యువతి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఇంటిని విక్రయించి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కాగా, మరో మతానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడాన్ని ఇషాక్ సోదరుడు నిసారుద్దీన్ అలియాస్ దీనా తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఈ వివాహం కారణంగా తనకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులందరూ చికెన్ దుకాణం వద్ద ఉండగా నిసారుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. ఒంటరిగా టీవీ చూస్తున్న వదినపై కత్తితో దాడి చేసి గొంతులో పొడిచాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో బట్టలు కుక్కి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం దుకాణం వద్దకు వెళ్లి తన అన్నతో పాటు, తల్లిదండ్రులకు విషయం చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు రక్తాన్ని తుడిచివేసి, మృతదేహంపైనున్న దుస్తులు మార్చారు. రక్తంతో తడిసిన చీర, ఇతర దుస్తులను ఓ కవర్లో ఉంచి 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలోని మురుగు కాలువలో పడేశారు. అనంతరం చందన హఠాత్తుగా చనిపోయిందంటూ స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నించారు. అదే రోజు రాత్రే హడావుడిగా మృతదేహాన్ని అశోక్ నగర్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. వీరి వ్యవహారాన్ని గమనించిన కాటికాపరి మృతికి దారి తీసిన కారణాలపై ఆరా తీయగా, తన తల్లి చనిపోయిందంటూ ఇషాక్ సమాధానమివ్వడంతో అతను పెద్దగా పట్టించుకోలేదు. అంత్యక్రియల అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు, అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి సామగ్రిని మరో చోటికి తరలించడంతో స్థానికుల్లో అనుమానం బలపడింది. దీంతో ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో విషయం ‘న్యూస్‌లైన్’ దృష్టికి రావడంతో ఘటన వెలుగు చూసింది. పోలీసుల అదుపులో నిందితులు సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎస్పీ సెంథిల్ కుమార్ విచారణకు ఆదేశించడంతో డీఎస్పీ నాగరాజ, సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ రెడ్డెప్పలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిసిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చందన చిన్నాన్న నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు నిసారుద్దీన్, భర్త ఇషాక్, వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్యులతోపాటు తహశీల్దార్ లక్ష్మినారాయణ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను గురువారానికి వాయిదా వేసినట్లు సీఐ తెలిపారు. కాగా, చందన మృతితో ఆమె ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు.


