రైతులకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక
వరి వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది మీరే
ఆలోచన చేసి ఆరుతడి పంటలే వేసుకోండి
కొత్తగా బోర్లు కూడా వేయొద్దు
తాగునీటికీ కటకటే.. ఇప్పటికే 51% లోటు వర్షపాతం.. వచ్చే 2 నెలలు కరవు మరింత తీవ్రం
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్ధసారథి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరవు పరిస్థితులు నేపథ్యంలో వరి పంట వేయవద్దని, నీళ్లు ఇవ్వలేమని రైతులకు రాష్ట్ర కేబినెట్ సూచించింది. గోదావరి, కృష్ణా డెల్టాల కింద కూడా ఇక నుంచి వరి వేయవద్దని రైతులను ప్రభుత్వం కోరుతున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కరవు పరిస్థితుల ప్రభావంపై చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా డెల్టా కింద వరి నాట్లు వేశారని, ఇక నుంచైనా రైతులు వరి నాట్లు వేయవద్దని కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇప్పుడు వరి నాట్లు వేస్తే తరువాత నీరు లేక నష్టపోయేది రైతులనేనని, ఈ నేపథ్యంలో ముందుగానే రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందన్నారు. సాగునీటి కాలువల కింద ఆయకట్టుతో పాటు వర్షాధార విస్తీర్ణంలో కూడా వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నట్లు చెప్పారు. వరి వేసి తరువాత నీరు లేక నష్టపోవడం కంటే ఆలోచన చేసి ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా రైతులకు సూచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా బోర్లు కూడా వేయవద్దని రైతులను కోరుతున్నామన్నారు. బోర్లు వేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికే కొరత ఏర్పడుతుందన్నారు.
తాగునీటికీ తీవ్ర ఎద్దడి వస్తుందని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే 51 శాతం లోటు వర్షపాతం నమోదైందని, వచ్చే రెండు నెలలు వర్షాలు లేక కరవు తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. గోదావరిలో సాధారణంగా లక్ష క్యూసెక్కుల వరద రావాల్సి ఉండగా కేవలం 38 వేల క్యూసెక్కులే వస్తోందని, దీంతో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంటుందన్నారు. ఆరుతడి పంటలు వేసుకునేందుకు 15 రకాల విత్తనాలతో కిట్స్ రైతులకు ఇస్తామని మంత్రి తెలిపారు. తాగునీటికి, పశు గ్రాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. కేబినెట్‌లో తీసుకున్న ఇతర నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.
» అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 66 ఏళ్ల లీజు ప్రాతిపదికన 99 సంవత్సరాల వరకు పొడిగించేందుకు ఆమోదం.
» ప్రకాశం జిల్లా కొండపి మండలం కె.జి.కంద్రిక గ్రామంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 99 ఏళ్ల వరకు పొడిగించేందుకు ఆమోదం.
» సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏపీ మార్క్‌ఫెడ్ టర్మ్ రుణంగా రూ.300 కోట్లు పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం.


