మురుగు కూపాల పక్కన ఆహార పదార్థాల విక్రయాలు పట్టించుకోని వీఎంసీ అధికారులు అంటువ్యాధులకు కార్కానాలుగా మారుతున్న వైనం గిరిపురంలో అతిసారకు నీటి కాలుష్యమే కారణం! డ్రెయినేజీ నీరు వాటర్‌లైన్లో కలిసినట్లు సమాచారం వాటర్ లైన్ డమ్మీ చేసి మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
పాలకులకు ప్రజల ఆరోగ్యం పట్టడం లేదు..
విజయవాడలో తాండవిస్తున్న అపారిశుద్ధ్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే తాండవిస్తోంది. ముఖ్యంగా మురుగు కంపు కొట్టే డ్రెయిన్లు పక్కనే ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు అంటు వ్యాధులకు కార్కానాలుగా మారుతున్నా.. వీఎంసీ అధికారులకు పట్టడం లేదు. ప్రజల ఆరోగ్యంపై విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా డయేరియా వంటి అంటు వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు 2024లో మొగల్రాజపురం.. 2025 న్యూ రాజరాజేశ్వరిపేట.. నేడు గిరిపురం ఇలా ఏటా ఏదో ప్రాంతంలో డయేరియా సోకడాన్నే నిదర్శనంగా చెబుతున్నారు. ఏదైనా ప్రాంతంలో డయేరియా సోకినప్పుడు రెండు.. మూడు రోజులు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవడమే కానీ, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీటిలో కలిసిన మలినమే కాటేసిందా?
గిరిపురంలో పది రోజులుగా 20 మందికి పైగా ప్రజలు డయేరియా బారిన పడ్డారు. రంగు మారిన నీరు తాగడం వల్లే డయేరియా సోకినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ అధికారులు నోరు మెదపడం లేదు. నీటి శ్యాంపిల్స్ సేకరించాం.. రిపోర్టులు రాలేదని మాత్రమే చెబుతున్నారు. మంచినీటి సరఫరా లైన్లో డ్రెయినేజీ వాటర్ కలిసినట్లు పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆదివారం గిరిపురంలో వాటర్ పైప్‌లైన్ డమ్మీ చేసి పలు ప్రాంతాల్లో మరమ్మతులు చేశారు. అంతేకాక కుళాయిల నుంచి వచ్చే వాటర్ తాగవద్దని, ఆర్వో వాటర్‌ను ఇంటింటికీ సరఫరా చేయడం కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అధికారులు మాత్రం కారణం బయటకు చెప్పడం లేదు. గత ఏడాది న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్వహించిన నీటి పరీక్షల ఫలితాలు కానీ, ఈ ఏడాది గిరిపురంలో నిర్వహించిన నీటి పరీక్ష ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు.
వీఎంసీ ఏమి చేస్తున్నట్లు?
నగర పాలక సంస్థలో ప్రజారోగ్య విభాగం ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం ఈ విభాగం పని. డ్రెయిన్‌ల నిర్వహణ, ఆహార పదార్థాల అమ్మకాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడటం, పారిశుద్ధ్య సమస్య లేకుండా వారే చూడాలి. కానీ నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం ఉంటే, ఆ విభాగం అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆహార పదార్థాల విక్రయాలు జరిపే చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా అనే విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు.
నగరంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. చెత్తా చెదారం, మురుగు కూపాల వద్దే ఆహార పదార్థాల విక్రయాలు జరుపుతున్నా అధికారులకు పట్టడం లేదు. కేవలం ఫుడ్‌కోర్టులతో పాలకులు జేబులు నింపుకుంటున్నారే కానీ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఆ ప్రాంతంలోని డ్రెయిన్‌లు, పరిసరాలు చూస్తే అంతా అర్థమవుతుంది. నగరం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలి. నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే


