అనైతికం.. అందుకే అడ్డుకుంటున్నాం | - | Sakshi
Sakshi News home page

అనైతికం.. అందుకే అడ్డుకుంటున్నాం

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

గన్నవరం రూరల్‌: పోలవరం కాలువపై రైతులకు నీరందించే మోటార్లు తొలగించమనటం అనైతికమని రైతులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆదివారం గన్నవరం మండలం సూరంపల్లి, కొండపావులూరు గ్రామాల్లో పోలవరం కాలువకు ఏర్పాటు చేసి ఉన్న మోటార్లు తొలగించాలని పోలవరం, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా పర్యటించి ఫ్యూజులు తొలగించారు. దీంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రాజకీయ నాయకులు, విజ్ఞత ఉన్న వాళ్లు చేసే నిర్ణయం ఇది కాదని మండిపడ్డారు. కృష్ణాడెల్టా స్థిరీకరణ పేరుతో ఇక్కడి రైతులను ఎండగడతారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఆనాడు పోలవరం కాలువకు తాము భూములు ఇవ్వకపోతే పోలవరం ఉండేదా అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోటార్లు ఆపేది లేదని రైతు నాయకుడు జూపల్లి సురేష్‌ తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆకుమడులకు నీరు ఇస్తున్నామని, ఇప్పటి వరకూ ఊడ్పులు లేవన్నారు. ‘మేం రైతులం కాదా? తాము పండించి పది మందికి పెడుతున్నాం? ఇక్కడి రైతులు అన్నం తినవద్దా?’ అంటూ ప్రశ్నించి, ప్రతిఘటించడంతో అధికారులు వెను తిరిగారు. ఫ్యూజులు తొలగించటం దారుణమని మండిపడ్డారు.

తీవ్ర వాగ్వాదం..

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: సాగునీటి తరలింపు విషయంలో ఇరిగేషన్‌ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పొలవరం కుడి ప్రధాన కాలువపై బాపులపాడు మండలం బండారుగూడెం వద్ద విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి సాగునీటిని తరలిస్తున్న రైతులను ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. నారుమళ్లు సాగుచేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అదునుకు నీళ్లు అందకపోతే నారు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వివరించారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పటంతో తాత్కాలికంగా వివాదం సర్దుమణిగింది.

పోలవరం కాలువపై మోటార్లు

తొలగింపును ప్రతిఘటించిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement