ఆషాఢ వైభవం.. ‘ఇంద్ర’ వైభోగం | - | Sakshi
Sakshi News home page

ఆషాఢ వైభవం.. ‘ఇంద్ర’ వైభోగం

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

ఆషాఢ వైభవం.. ‘ఇంద్ర’ వైభోగం జగన్మాతకు ప్రణమిల్లిన భక్తజనం

ఉదయం నుంచి రాత్రి వరకూ సారె సమర్పణలు ఆషాఢంలో తొలి ఆదివారం కావడంతో రద్దీ అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు

ప్రాంగణంలో కోలాహలం..

జగన్మాతకు ప్రణమిల్లిన భక్తజనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

అన్ని టికెట్ల విక్రయాలు రద్దు..

గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్‌ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్‌లైన్‌లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించి వారికి అంతరాలయ దర్శనం కల్పించారు.

రిజిస్ట్రేషన్‌ కాకుండానే..

అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్తులు, భక్త బృందాలు ఆలయ ప్రాంగణంతో పాటు కనకదుర్గనగర్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే ఆదివారం రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు ఎక్కడా వేచి ఉండే పరిస్థితులు కనిపించలేదు. దీంతో సారె సమర్పించే వారు రిజిస్ట్రేషన్‌ కాకుండానే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకోవడం, సారె సమర్పించడం జరిగింది. ఆదివారం అనధికార లెక్కల ప్రకారం వందకు పైగా భక్త బృందాలు సారెను సమర్పించినట్లు తెలుస్తోంది.

చైర్మన్‌, ఈవోల పర్యవేక్షణ

రద్దీ అధికంగా ఉండటంతో ఎవరికీ వీఐపీ దర్శనాలు కల్పించవద్దని ఆలయ ఈవో శీనానాయక్‌ ప్రోటోకాల్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘాట్‌రోడ్డులోని సమాచార కేంద్రానికి చేరుకున్న ఈవో సిబ్బందికి పలు సూచనలిచ్చారు. మరో వైపున చైర్మన్‌ బొర్రా రాధా కృష్ణ మహా మండపం ఆరో అంతస్తులో సారె సమర్పించిన భక్తులను కలిసి మాట్లాడారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు స్కానింగ్‌ పాయింట్‌లో రద్దీని పర్యవేక్షించారు.

నగరానికి చెందిన భక్త బృందాలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారెను సమర్పించేందుకు ఇంద్ర కీలాద్రికి తరలివచ్చారు. భక్తుల వాహనాలతో కొండ దిగువన పలు మార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే మార్గంలో బస్సులు, కార్లను పున్నమీ ఘాట్‌, భవానీపురం పరిసరాల్లోనే నిలిపివేశారు. దేవస్థాన బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలను మాత్రమే కొండపైకి తరలించారు. వీవీఐపీ ప్రోటోకాల్‌ ఉన్న వాహనాలను సైతం ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్‌ వరకు మాత్రమే అనుమతించారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక విధులను నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement