తాడేపల్లి: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ చేయటం ద్వారా పోర్టును అభివృద్ధి చేస్తున్నారా? స్కాం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటమేనంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.
సాధారణంగా పోర్టుల ఆధారిత అభివృద్ధి, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి అపార అవకాశాలు ఇస్తుందని చెప్పారు. ఈ అవగాహనతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట వద్ద 3 పోర్టుల అభివృద్ధిలో ప్రశంసనీయ పురోగతి సాధించిందని తెలిపారు. ఈ 3 పోర్టులకు భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఆర్థిక అంశాలు సహా అన్ని కీలక పనులు పూర్తి చేసిందని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఈపీసీ ఒప్పందాలు అమలు చేసి, జూన్ 2024 నాటికి 3 పోర్టుల నిర్మాణంలో గణనీయ పురోగతి సాధించిందని వివరించారు.
‘‘రామాయపట్నం పోర్టు సాధించిన గణనీయ పురోగతి వల్లే ఆర్థికాభివృద్ధికి నిదర్శనాలుగా నిలిచిన కొన్ని ప్రాజెక్టుల్లో బీపీసీఎల్ ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ సముదాయం, ఇండోసోల్ సోలార్ గిగా స్థాయి తయారీ కేంద్రం ఉన్నాయి. బీపీసీఎల్ ప్లాంట్ పోర్టుకు సమీపంలోనే 9-12 ఎంఎంటీపీఏ శుద్ధి సామర్థ్యంతో, రూ.లక్ష కోట్లకు పైగా అంచనా పెట్టుబడితో ఏర్పడుతోంది. ముడి చమురును దిగుమతి చేసుకునే పనిలో పోర్టు లోతైన జల సామర్థ్యాన్ని ఇది వినియోగించుకోనుంది.
ఇండోసోల్ కేంద్రాన్ని పూర్తిస్థాయి సమీకృత "క్వార్ట్జ్-టు-మాడ్యూల్" వ్యవస్థగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ముడి పదార్థాల దిగుమతి, పూర్తి అయిన సోలార్ మాడ్యూళ్ల ఎగుమతి సమర్థంగా సాగాలంటే లోతైన జలాలు ఉన్న రామాయపట్నం పోర్టు సమీపం అత్యంత కీలకం. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా రామాయపట్నం పోర్టులో 2 బెర్త్‌లను అభివృద్ధి చేస్తోంది. కడప జిల్లాలో నిర్మిస్తున్న సమీకృత ఉక్కు కర్మాగారానికి అవసరమైన ఇనుప ఖనిజం, కోకింగ్ బొగ్గు వంటి భారీ ముడి పదార్థాల నిర్వహణే వీటి ప్రధాన ఉద్దేశం’’ అని తెలిపారు.
రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం
ఈ ప్రాజెక్టులన్నీ వేలాది మందికి ఉపాధి కల్పించడంలో, రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడంలో భారీగా దోహదపడుతున్నాయని చెప్పారు. ‘‘రామాయపట్నం పోర్టు అభివృద్ధి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం గణనీయంగా పెరగడం వంటి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నా, టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఒక్కటే. రామాయపట్నం పోర్టును కుంభకోణంగా మార్చి, టీడీపీ పెద్దలకు నగదు ప్రవాహాలు సృష్టించే మార్గం.
ప్రభుత్వం రూ.4,929 కోట్లు ఖర్చు చేస్తున్న పోర్టును, ప్రైవేట్ పక్షాలు కేవలం రూ.1,500 కోట్లు ముందస్తు చెల్లింపుగా ఇచ్చే విధంగా అప్పగిస్తోంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరుగుతోంది. రూ.3,500 కోట్లకు పైగా అప్పు చెల్లింపుల భారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఇదెక్కడి ఆర్థిక శాస్త్రం చంద్రబాబూ?’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.
𝗧𝗵𝗲 𝗙𝘂𝘁𝘂𝗿𝗲 𝗼𝗳 𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 𝗣𝗼𝗿𝘁: 𝗗𝗲𝘃𝗲𝗹𝗼𝗽𝗺𝗲𝗻𝘁 𝗼𝗿 𝗦𝗰𝗮𝗺!
𝗗𝗶𝘀𝗶𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗘𝘅𝗽𝗲𝗻𝘀𝗲?
Port led development provides enormous potential for economic development of the successor State of Andhra…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2026


