కర్నూలు: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆస్పరి మండలం బిల్లేకల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ లక్ష్మన్నపై బెదిరింపులకు దిగారు టీడీపీ నాయకులు. ఆస్పరి మండలం బిల్లెకల్ గ్రామంలో వెంచర్ వేసినందుకు రూ. 30 లక్షలు నగదుతో పాటు రెండు ప్లాట్లు ఇవ్వాలంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లెకల్ వెంకటేష్. డిమాండ్ చేశారు. వెంచర్ యాజమానులు డబ్బులు ఇవ్వనందుకు వెంచర్‌ను ట్రాక్టర్‌తో దున్నించాడు వెంకటేష్.
అయితే వెంచర్ వేసినందుకు ఇప్పటికే టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతికి రెండు లక్షల రూపాయలు ఇచ్చామని తెలిపారు వెంచర్ యజమానులు. దాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు తనకు రూ. 30 లక్షలు, రెండు ప్లాట్లు ఇవ్వాలని బిల్లెకల్ వెంకటేష్ రాద్దాంతం చేస్తున్నాడు.
అతను చెప్పినట్లు చేయనందుకు వెంచర్‌ను దున్నేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అసలే వ్యాపరం లేక ఇబ్బంది పడుతుంటే ఇలా అడిగిన వారికంతా డబ్బులు ఇస్తే తాము రోడ్డున పడాలని వెంచర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


